వెంకటగిరిరూరల్: కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా క్షణికావేశంలో భార్యను చంపి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతనికి భార్య లేని లోటు కనిపించింది. దీంతో మనస్తాపానికి గురై అతడు కూడా ఉరేసుకుని తనువు చాలించాడు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన వారి పిల్లలు ఇద్దరు అనాథలుగా మారిన ఘటన వెంకటగిరి పట్టణంలోని బొగ్గులమిట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి పట్టణం బొగ్గులమిట్ట ప్రాంతానికి చెందిన రాయని వీరభద్రయ్య (38) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి, ఆర్నెళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంట్లో భార్య శాంతితో అతనికి చిన్నపాటి మనస్పర్థలు రావడంతో క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ కేసులో అతను జైలుకు కూడా వెళ్లాడు. వారం క్రితం వీరభద్రయ్య జైలు నుంచి విడుదలయ్యాడు. మంగళవారం రాత్రి అతని తల్లి సుబ్బమ్మ, ఇద్దరు చిన్నారులతో బయట నిద్రిస్తుండగా వీరభద్రయ్య భార్య లేదని మనస్తాపానికి గురై ఇంటి పైకప్పునకు ఉన్న ఇనుప చువ్వకు చీరతో ఉరేసుకున్నాడు. అనుమానం వచ్చి తల్లి సుబ్బమ్మ తలుపుతట్టినా ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. వీరభద్రయ్య ఉరేసుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఏఎస్‌ఐ బీవీ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న భర్త
అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment