సౌతాఫ్రికా, జింబాబ్వేలతో సిరీస్‌కు కివీస్‌ జట్టు ప్రకటన | New Zealand Announce T20I squad for Tri Series Vs Zimbabwe South Africa | Sakshi
Sakshi News home page

ట్రై సిరీస్‌కు కివీస్‌ జట్టు ప్రకటన.. కేన్‌ మామ లేడు.. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు చోటు

Jun 27 2025 11:21 AM | Updated on Jun 27 2025 12:31 PM

New Zealand Announce T20I squad for Tri Series Vs Zimbabwe South Africa

జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ముక్కోణపు టీ20 సిరీస్‌ (T20 Tri Series)కు న్యూజిలాండ్‌ క్రికెట్‌​ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో పేసర్‌ ఆడం మిల్నే (Adam Milne) తిరిగి రాగా.. బెవాన్‌ జేకబ్స్‌ (Bevon Jacobs) తొలిసారి చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. కొంత మంది సీనియర్లు మాత్రం వివిధ కారణాల వల్ల దూరమయ్యారు.

కేన్‌ మామ ఎందుకు దూరం అయ్యాడంటే?
మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు పేసర్లు లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ సియర్స్‌, కైలీ జెమీషన్‌.. అదే విధంగా.. బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే ఈ త్రైపాక్షిక సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. విలియమ్సన్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీల్లో మిడిల్సెక్స్‌ జట్టుకు ఆడుతుండటంతో.. సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఇక పక్కటెముకల నొప్పి కారణంగా బెన్‌ సియర్స్‌ జట్టుకు దూరం కాగా.. ఫెర్గూసన్‌కు పనిభారం తగ్గించే నిమిత్తం విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. జెమీషన్‌ తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో సెలవు తీసుకున్నాడు.

వారిద్దరి రీ ఎంట్రీ
ఈ జింబాబ్వే- సౌతాఫ్రికాలతో సిరీస్‌ సందర్భంగా ఆల్‌రౌండర్లు గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర తిరిగి జట్టులోకి రాగా.. కెప్టెన్‌ సాంట్నర్‌ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సాంట్నర్‌ ప్లే ఆఫ్స్‌ కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ బెవాన్‌ జేకబ్స్‌ తొలిసారి జట్టులోకి రాగా.. మిల్నే కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌తో న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాలు ఆరంభించనుంది. ఈ విషయాల గురించి కొత్త కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘బెవాన్‌ దేశీ క్రికెట్‌లో, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక మిల్నే నైపుణ్యాలున్న టీ20 బౌలర్‌.

ఫెర్గూసన్‌, సియర్స్‌, జెమీషన్‌ లేరు కాబట్టి మిల్నే రాకతో ప్రయోజనం చేకూరుతుంది. వరల్డ్‌కప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో మాకు సిరీస్‌ ఎంతో ముఖ్యమైనది. వైవిధ్యంతో కూడిన జట్టును అందుకే ఎంపిక చేశాం’’ అని పేర్కొన్నాడు.

జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ట్రై సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు
మిచెల్‌ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.

చదవండి: భార‌త్‌-ఇంగ్లండ్ వ‌న్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్‌, జ‌ట్లు తదితర వివరాలు ఇవే

Advertisement
 
Advertisement
Advertisement