Sakshi News home page

కెప్టెన్‌ కోరుకునేది ఇదే కదా: పాండ్యాపై రోహిత్‌ కామెంట్స్‌.. వైరల్‌ వీడియో

Published Mon, Apr 8 2024 1:46 PM

IPL 2024 Something That Captain Want: Rohit After Receives Dressing Room Award - Sakshi

Rohit Sharma Comments After MI Win: ‘‘మన బ్యాటింగ్‌ ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌ నుంచి మనం ఇందుకోసమే కృషి చేస్తున్నాం కదా!.. వ్యక్తిగత ప్రదర్శనలు ఎప్పుడూ పెద్దగా పరిగణనలోకి రావు.

బ్యాటింగ్‌ విభాగం మొత్తం సమిష్టిగా నిలబడి.. ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం. అలాంటపుడే ఇలాంటి భారీ స్కోర్లు నమోదు చేయగలం.

మనం చాలా రోజులుగా దీని గురించే చర్చించుకుంటున్నాం కదా! బ్యాటింగ్‌ కోచ్‌, మార్క్‌, కెప్టెన్‌ మన నుంచి ఆశిస్తున్నది ఇదే’’ అంటూ ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు.

గెలుపు బోణీ
ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై తొలి విజయం అందుకున్న విషయం తెలిసిందే. హోం గ్రౌండ్‌ వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై అదరగొట్టింది.

రోహిత్‌, ఇషాన్‌ మెరుపులు
ఓపెనర్లు రోహిత్‌ శర్మ(27 బంతుల్లో 49), ఇషాన్‌ కిషన్‌(23 బంతుల్లో 42) శుభారంభం అందించగా.. రీఎంట్రీ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(0) మాత్రం నిరాశపరిచాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(33 బంతుల్లో 39) నెమ్మదిగా ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

టిమ్‌, రొమారియో షెఫర్డ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో తిలక్‌ వర్మ(6) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే వెనుదిరిగినా.. టిమ్‌ డేవిడ్‌(21 బంతుల్లో 45), రొమారియో షెఫర్డ్‌(10 బంతుల్లో 39) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టారు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటారు. ఇలా బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం హాఫ్‌ సెంచరీ చేయకపోయినా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను 205 పరుగులకే కట్టడి చేసి గెలుపు బోణీ కొట్టింది. ఈ నేపథ్యంలో డ్రెసింగ్‌రూంలో సమావేశమైన ముంబై ఇండియన్స్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. అదే విధంగా పాత ఆనవాయితీని కొనసాగిస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇచ్చే స్పెషల్‌ బ్యాడ్జిని ఈసారి రోహిత్‌ శర్మకు అందజేసింది.

హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ ఈ మేరకు విన్నర్‌ పేరును ప్రకటించగానే బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ రోహిత్‌కు పురస్కారం అందించాడు. అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇది చూసిన హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించిన జట్టులో ఆటగాడిగా ఉండి.. మరొకరి ప్రణాళికలకు అనుగుణంగా నేను ఆడాను అని నువ్వు ఇలా చెప్పడాన్ని చూడలేకపోతున్నాం భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక బౌచర్‌ తన పేరు చెప్పగానే రోహిత్‌ కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టుడిగా ఉండిపోయి.. ఆ తర్వాత తప్పదన్నట్లుగా ఓ నవ్వు విసరడం కొసమెరుపు. కాగా గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి పాండ్యాను ట్రేడ్‌ చేసుకుని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమించడంలో కోచ్‌ మార్క్‌ బౌచర్‌ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

భవిష్యత్‌ సారథిని తయారు చేయాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్‌ చెప్పగా.. రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే అతడి వ్యాఖ్యలపై మండిపడ్డ విషయం తెలిసిందే.

చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్‌: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్‌

Advertisement
Advertisement