ఆ బంతిని మళ్లీ ప్రయోగించాడు.. ఒక్క ఓవర్‌తోనే సరి | Sakshi
Sakshi News home page

ఆ బంతిని మళ్లీ ప్రయోగించాడు.. ఒక్క ఓవర్‌తోనే సరి

Published Tue, Apr 20 2021 12:14 AM

IPL 2021: Riyan Parag Does It Again Round Arm Ball - Sakshi

ముంబై:  ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌  రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్ వేసి అంపైర్‌ వార్నింగ్‌కు గురయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో భాగంగా గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌కు యత్నించాడు పరాగ్‌. 10 ఓవర్‌ మూడో బంతిని రౌండ్‌ ఆర్మ్‌ బంతిగా వేశాడు. ఆ క్రమంలో అతని మోచేతి గ్రౌండ్‌కు దాదాపు సమాంతరంగా ఉండటంతో అంపైర్‌ రంగంలోకి దిగాడు. ఆ బంతిని ఉద్దేశిస్తూ.. జాగ్రత్త.. అంతలా రౌండ్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ వేస్తే నిబంధనలకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో వెంటనే పరాగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేశాడు.

తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లోనూ మళ్లీ రౌండ్ ఆర్మ్‌ బౌలింగ్‌ వేశాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌లో ఆ బంతిని ప్రయత్నించాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతికి అంబటి రాయుడు‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సమయంలో ఆ బంతిని వేశాడు. ఓవర్‌ ద స్టిక్‌ బౌలింగ్‌ వేస్తూ పరాగ్‌ రౌండ్‌ ఆర్మ్‌ బంతి వేశాడు. మోచేతిని బాగా కింది నుంచి తిప్పుతూ వేసిన ఈ బంతి ఔట్‌ సైడ్‌ వైడ్‌ అయ్యింది.

అయితే, బంతి ప్రమాదకరస్థాయిలో ఉండటంతో అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక్కడ నిబంధనలకు లోబడి ఆ బంతిని వేయకపోవడమే కాకుండా బ్యాట్స్‌మన్‌  శరీరాన్ని టార్గెట్‌ చేసే విధంగా బంతి ఉండటంతో అంపైర్‌ మరోసారి హెచ్చరించాడు. దాంతో సాధారణ బౌలింగ్‌కు వచ్చేశాడు పరాగ్‌. కాగా, పరాగ్‌కు ఇక మళ్లీ ఓ‍వర్‌ ఇవ్వలేదు కెప్టెన్‌ సంజూ సామ్సన్‌. ఆ ఒక్క ఓవర్‌తోనే సరిపెట్టాడు. ఒక్క ఓవర్‌లోనే పరాగ్‌ 16 పరుగులు ఇవ్వడంతో బౌలింగ్‌ ఆపేశాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement