జోరు సాగనీ... | Indias second T20 against West Indies today | Sakshi
Sakshi News home page

జోరు సాగనీ...

Oct 9 2026 4:27 AM | Updated on Oct 9 2026 4:27 AM

Indias second T20 against West Indies today

నేడు వెస్డిండీస్‌తో భారత్‌ రెండో టి20

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

రాంచీ: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న భారత పురుషుల టి20 క్రికెట్‌ జట్టు... వెస్టిండీస్‌తో రెండో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విండీస్‌పై తొలి టి20లో ఘనవిజయం సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా శుక్రవారం రెండో మ్యాచ్‌ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న భారత జట్టుకు కరీబియన్‌లు ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి. ఓపెనర్‌ సంజూ సామ్సన్‌ ఫామ్‌ తప్ప... టీమిండియాకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. 

15 ఏళ్ల యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ అవకాశం కోసం కాచుకొని కూర్చున్న నేపథ్యంలో సామ్సన్‌పై ఒత్తిడి ఉండనుంది. ఆ ఒక్కటి మినహా... టాపార్డర్‌ మంచి దూకుడు మీద ఉంది. బౌలింగ్‌లో మయాంక్‌ యాదవ్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. ఇక మరోవైపు వెస్టిండీస్‌ జట్టు తొలి టి20లో టీమిండియాకు కనీస పోటీనివ్వలేకపోయింది. విశ్వవ్యాప్తంగా జరిగే దాదాపు అన్నీ లీగ్‌ల్లో కీలకంగా వ్యవహరించే కరీబియన్‌ ప్లేయర్లు కలిసి కట్టుగా ఆడటంలో మాత్రం విఫలమవుతున్నారు. రాంచీ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం కాస్త కష్టమే. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.  

సామ్సన్‌ స్థానంలో సూర్యవంశీ! 
ఏడేళ్లుగా సొంతగడ్డపై టి20 సిరీస్‌ కోల్పోని టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో 2–0తో ముందంజ వేయాలని పట్టుదలగా ఉంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 9, 7, 2, 11 పరుగులు మాత్రమే చేసిన సామ్సన్‌ కాస్త ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అయితే ఇప్పట్లో అతడిని తప్పించి వైభవ్‌కు తుది జట్టులో చోటు కల్పించాలనే ఆలోచన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మదిలో ఉందో లేదో చెప్పలేము. దాంతో ఈ టీనేజ్‌ సంచలనం మరికొంత కాలం వేచి చూడక తప్పకపోవచ్చు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మతో కలిసి సామ్సన్‌ జట్టుకు మెరుగైన ఆరంభం ఇవ్వాల్సిన అవసరముంది.

 ఇషాన్‌ కిషన్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మలతో మిడిలార్డర్‌ బలంగా ఉంది. చాన్నాళ్లుగా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడని శ్రేయస్‌... గత మ్యాచ్‌లో తన తొలి టి20 శతకం ఖాతాలో వేసుకున్నాడు. అతడి నుంచి మేనేజ్‌మెంట్‌ ఇలాంటి దూకుడునే ఆశిస్తోంది. ఇక శివమ్‌ దూబే, నమన్‌ ధీర్, అక్షర్‌ కూడా భారీ షాట్‌లు కొట్టగల సమర్థులే. బౌలింగ్‌లో మాత్రం కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న మయాంక్‌  స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ బరిలోకి దిగనుండగా... అర్ష్ దీప్‌పై అదనపు భారం పడనుంది. అక్షర్‌తో కలిసి కుల్దీప్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

3 రాంచీ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.  

హిట్టర్లపైనే భారం 
భారీ షాట్‌లకు పెట్టింది పేరైన విండీస్‌ ప్లేయర్లు గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయ్యారు. బౌలింగ్‌ అంతంత మాత్రమే ఉన్న కరీబియన్‌ జట్టు... తమ బలమైన బ్యాటింగ్‌లో మరింత భారీ స్కోరు చేయాల్సిన అవసరముంది. కనీసం 200 పైచిలుకు లక్ష్యాన్ని బోర్డుపై నిలిపితేనే టీమిండియాను ఆపగలిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో... బ్యాటర్లు అంతా కలిసి కట్టుగా రాణించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. కెప్టెన్‌ షై హోప్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ గత మ్యాచ్‌లో అర్ధశతకాలతో మెరవగా... వీరితో పాటు కమిల్‌ పూరన్, హెట్‌మైర్, పావెల్, చేజ్, రొమారియో షెఫర్డ్, మాథ్యూ ఫోర్డ్‌ సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్‌లో షమార్‌ జోసెఫ్, అకీల్‌ హుసేన్‌ కీలకం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement