● ప్రతిష్టాత్మకంగా పండుగల నిర్వహణ ● మున్సిపల్ డీఈ ప్రేరణ పాండ
సిద్దిపేటజోన్: బల్దియా పరిధిలో బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఏర్పాట్లలో రాజీ పడొద్దని, సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ డీఈ ప్రేరణ పాండ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. వార్డుల్లో ప్రతి రోజు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని చెరువులు, కుంటల వద్ద ఆయా వార్డు ఆఫీసర్ ఆధ్వర్యంలో బృందాలు పండుగ పూర్తి అయ్యే వరకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ అత్యంత అద్భుతంగా జిల్లా కేంద్రంలో జరుగుతుందన్నారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, మహిళలకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెరువుల వద్ద లైటింగ్, సౌండ్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, బతుకమ్మ ఘాట్ లకు రంగులు వేయాలని ఆదేశించారు. పట్టణంలో అన్ని వార్డుల్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రధాన కూడళ్లలో, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో చదును చేసి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


