44 గుర్తులు.. మూడు ఈవీఎంలు | Sakshi
Sakshi News home page

44 గుర్తులు.. మూడు ఈవీఎంలు

Published Fri, Nov 17 2023 4:24 AM

-

ఓటర్లకు పరీక్షే..!
● 45 నంబర్‌ ‘నోటా’కు కేటాయింపు ● మున్నెన్నడూలేని పరిస్థితి ● విభిన్నంగా గజ్వేల్‌ ఎన్నిక

గజ్వేల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి విభిన్నమైన పరిస్థితి నెలకొన్నది. గజ్వేల్‌ బరిలో మున్నెన్నడూ లేని విధంగా 44మంది నిలిచారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అభ్యర్థులున్న నియోజకవర్గంగా మారింది. ఈ క్రమంలో పోలింగ్‌ సందర్భంలో ఓటర్ల సహనానికి పరీక్ష తప్పేలా లేదు. సాధారణంగా ఒక్కో ఈవీఎం యంత్రంలో 16 గుర్తులు ఉంటాయి. ఇక్కడ పోటీలో ఉన్న 44 మంది కోసం మూడు యంత్రాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 45 నంబర్‌ను ‘నోటా’కు కేటాయించనున్నారు.

తొలి ఈవీఎంలోనే ప్రధాన అభ్యర్థులు..

తొలి ఈవీఎంలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలకు చెందిన ఈటల రాజేందర్‌(బీజేపీ)కు మొదటి నంబర్‌, తూంకుంట నర్సారెడ్డి(కాంగ్రెస్‌)కి రెండో నంబర్‌, కేసీఆర్‌(బీఆర్‌ఎస్‌)కు మూడో నంబర్‌, జక్కని సంజయ్‌కుమార్‌(బీఎస్సీ)కు నాలుగో నంబర్‌ కేటాయించనున్నారు. ఇకపోతే గుర్తింపు లేని రాజకీయ పార్టీల అభ్యర్థులు సదానందరెడ్డి(పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ పార్టీ), బుగ్గ రాజు (ధర్మ సమాజ్‌ పార్టీ), నేలపాటి నాగరాజు (విద్యార్థుల రాజకీయ పార్టీ), నీరుడి ప్రసాద్‌ (బ్లూ ఇండియా పార్టీ), పోతు అశోక్‌ (మన తెలంగాణ రాష్ట్ర సమాఖ్య పార్టీ), రచ్చ సుభద్రారెడ్డి (సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా), సిలివేరు ఇంద్రాగౌడ్‌(నేషనల్‌ నవక్రాంతి పార్టీ), రామరాజు(యువతరం పార్టీ), పోరెడ్డి వేణుగోపాల్‌(ఆబాద్‌ పార్టీ), రఘుమారెడ్డి(యుగ తులసి పార్టీ), ధాత్రిక సంతోష్‌(నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), రంగన్నగారి జ్యోతి(ఇండియా ప్రజాబందు పార్టీ), రాగుల నాగరాజు(భారత చైతన్య యువజన పార్టీ), గడ్డం అనిత(ఘన సురక్ష పార్టీ), వొల్లాల ప్రవీణ్‌కుమార్‌ రావు(సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి), మహ్మద్‌ హైమద్‌(జన శంఖారావం పార్టీ), గడ్డం అశోక్‌(ఆల్‌ ఇండియా హిందుస్తాన్‌ కాంగ్రెస్‌ పార్టీ) తర్వాతి నంబర్లు రానున్నాయి. ఇవీ పూర్తయ్యాక ఇండిపెండెంట్‌ అభ్యర్థుల గుర్తులుంటాయి. 2018 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ కేవలం 13మంది మాత్రమే బరిలో ఉన్నారు. ప్రస్తుతం 44మంది బరిలో ఉండటంతో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పోలింగ్‌ సందర్భంగా వృద్ధులు, నిరక్షరాస్యులు తికమకపడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్‌ తీరు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

అవగాహన కల్పిస్తాం: బన్సీలాల్‌

ఈ అంశంపై గజ్వేల్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బన్సీలాల్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సందర్భంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు, తికమక తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఓటర్లకు అవగాహన కూడా కల్పిస్తామని వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement