నేరుగా ఫిర్యాదు చేయొచ్చు | Sakshi
Sakshi News home page

నేరుగా ఫిర్యాదు చేయొచ్చు

Published Sat, Nov 11 2023 4:22 AM

మాట్లాడుతున్న రాంచందర్‌ - Sakshi

సంగారెడ్డి టౌన్‌: అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్ట్యా జహీరాబాద్‌, సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఫిర్యాదు లు ఏవైనా ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకు రావాలని సాధారణ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ పవన్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఉల్లంఘనలు, ఫిర్యాదులుంటే ఫోన్‌ నెంబర్‌ 87121 92115కు ఫిర్యాదు /సంప్రదించవచ్చని కోరా రు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

పర్యావరణ

పరిరక్షణపై అవగాహన

● కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి టౌన్‌: విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా సంయుక్త స్కూల్‌ యాజమాన్య, విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాధురి, అదనపు ఎస్పీ అశోక్‌, డీఆర్‌ఓ నగేష్‌, స్కూల్‌ డైరెక్టర్‌ రితేష్‌గౌడ్‌, తేజస్‌గౌడ్‌, సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఆరు లారీలు, ఏడు ట్రాక్టర్ల సీజ్‌

సంగారెడ్డి: జిల్లాలో స్పెషల్‌ టాస్క్‌పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివరాలు.. ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన ఆంజనేయులు గ్రామ శివారులో అక్రమంగా ఇసుక ఫిల్టర్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నాలుగు లారీల ద్వారా అక్రమ రవాణా చేస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు, ఏడు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు

విడుదల చేయాలి

జహీరాబాద్‌ టౌన్‌: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను నిధులను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి రాజేష్‌ కోరారు. స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నారన్నారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు రాక ఫీజులు కట్టాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్కాలర్‌షిప్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవేందర్‌, సందీప్‌, అరుణ్‌, అజర్‌ తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి

జహీరాబాద్‌ టౌన్‌: నిమ్జ్‌ కోసం సేకరించిన భూములకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిమ్జ్‌ భూబాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌ మాట్లాడుతూ మొదటి విడతగా పలు గ్రామాల్లోని వేల ఎకరాలలో భూమిని సేకరించారని, రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న ధరణి వల్ల రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు. దశాబ్దాల నుంచి పంటలు సాగుచేసుకుంటున్న భూములకు సంబంధించి కొంత మంది రైతులకు ఇంత వరకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. పలు మార్లు ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిన లాభం లేదన్నారు.

మజ్లిస్‌తో ముస్లింలకు

ఒరిగేదేమీ లేదు

రజాయి ఇలాహి ఫౌండేషన్‌ చైర్మన్‌ సయ్యద్‌ సలీం

జహీరాబాద్‌: మజ్లిస్‌ పార్టీతో ముస్లిం మైనార్టీలకు ఒరిగేదేమీ లేదని రజాయి ఇలాహి ఫౌండేషన్‌ చైర్మన్‌ సయ్యద్‌ సలీం అన్నారు. శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మజ్లిస్‌ పార్టీ పరోక్షంగా బీజేపీకే మద్ధతు పలుకుతోందన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్ధతు ఇస్తోందన్నారు. ముస్లిం మైనార్టీలు అనేక పేదరికంలో ఉన్నా వారికి మైనార్టీ బంధు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు మజ్లిస్‌ ఉచ్చులో పడకుండా కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆజంఖాన్‌ కుటుంబాన్ని పలు కేసుల్లో జైలులో పెట్టారన్నారు.

Advertisement
Advertisement