వికటించిన మహిళా ఆర్‌ఎంపీ వైద్యం
మానకొండూర్ రూరల్: మహిళా ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి, ఓ వృద్ధురాలు చావుబతుకుల మధ్య ఉంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామంలోని రాంనగర్ బేడబుడిగ జంగాల కాలనీకి చెందిన భూపతి కనకవ్వకు ఈ నెల 2న జ్వరం వచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు వైద్యం కోసం స్థానిక ఆర్‌ఎంపీ మమతను ఇంటికి పిలిపించారు. కనకవ్వను పరీక్షించిన ఆమె, గ్లూకోజ్ పెట్టి, అందులో ఇంజెక్షన్ కలిపి వెళ్లిపోయింది. 30 నిమిషాల తర్వాత ఆ వృద్ధురాలి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు రావడంతో ఆర్‌ఎంపీకి సమాచారం ఇచ్చారు. ఆమె మళ్లీ వచ్చి, ఇంకో ఇంజెక్షన్ వేసి, వెళ్లిపోయింది. 20 నిమిషాల తర్వాత కనకవ్వ నాలుక లావై, కాళ్లూచేతులు చచ్చుబడిపోయాయి. వెంటనే కుటుంబసభ్యులు 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి, 6 రోజులు చికిత్స చేయించారు. అక్కడినుంచి మరో దవాఖానాలో చేర్పించారు. కనకవ్వ ఎక్కువ రోజులు బతకదని వైద్యులు నిర్దారించడంతో మంగళవారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి కుమారుడు రమేశ్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు.
చావుబతుకుల మధ్య వృద్ధురాలు
ఎక్కువ రోజులు బతకదన్న వైద్యులు
ఇంటికి తీసుకొచ్చిన కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment