Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో ఐరిష్‌ నమోదు

Published Fri, Mar 29 2024 1:10 AM

అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ - Sakshi

సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఐరిష్‌ను రికార్డు చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేస్తామని, తూకంలో పారదర్శకత ఉండాలని, నిర్ధేషిత బరువు మాత్రమే ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ సూచించారు. కలెక్టరేట్‌లో రబీ(యాసంగి) సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, కొనుగోలు కేంద్రాలను అధికారులు, ఆయా శాఖల బాధ్యులు మాత్రమే ప్రారంభించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు, విద్యుత్‌ వసతి కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏ–గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,203, కామన్‌ రకానికి రూ.2,183 చెల్లిస్తుందని తెలిపారు.

ఏప్రిల్‌ 1న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రబీ సీజన్‌ కోతలు మొదలైనందున జిల్లాలోని 13 మండలాల్లో ఏప్రిల్‌ 1వ తేదీన ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 3 లక్షల నుంచి 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 201, ఐకేపీ ఆధ్వర్యంలో 44, డీసీఎంఎస్‌ పరిధిలో 10, మెప్మాలో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐరిష్‌ యంత్రాలతో ఐరిష్‌ రికార్డు చేయడం ద్వారా కొనుగోళ్లలో పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు. కేటాయించిన రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కోరారు. జిల్లాలో టార్పాలిన్లు 8,454, తూకం వేసే యంత్రాలు 265, ప్యాడీ క్లీనర్లు 613, తేమ శాతం చూసే మెషిన్లు 570 అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. డీసీఎస్‌వో ఎస్‌.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ జితేంద్రప్రసాద్‌, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, డీటీవో లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

వడ్లు క్వింటాలుకు ఏ–గ్రేడ్‌ రూ.2,203

కామన్‌ రకానికి రూ.2,183

ఏప్రిల్‌ 1న మండలానికో కేంద్రం

అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

Advertisement

What’s your opinion

Advertisement