వేములవాడ మున్సిపల్‌లో ముసలం? | Sakshi
Sakshi News home page

వేములవాడ మున్సిపల్‌లో ముసలం?

Published Tue, Dec 12 2023 11:42 PM

వేములవాడ మున్సిపాలిటీ - Sakshi

● వైస్‌ చైర్మన్‌ రాజీనామాతో తెరపైకి అసమ్మతి ● ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పరాభవంతో కౌన్సిలర్లలో పెరిగిన ఆలోచనలు ● పార్టీ మారేందుకు సిద్ధపడుతున్న పలువురు

వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడినట్లు ప్రచారంలో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతోనే మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మధు రాజేందర్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి, అసమ్మతి బయటపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని 28 వార్డుల్లో ఓటింగ్‌ సరళి, వచ్చిన ఫలితాలపై బేరీజు వేసుకున్న సదరు నాయకులు తమ భుజాలను తుడుముకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఓటింగ్‌ సరళిపై సమీక్షించి వెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఏకంగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

మారిన రాజకీయం

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో వేములవాడ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవతో కౌన్సిలర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్‌గా మధు రాజేందర్‌ను ఎంపిక చేశారు. కొన్నాళ్ల తర్వాత చైర్‌పర్సన్‌ భర్త, వైస్‌చైర్మన్‌ మధ్య బేధాలు ఏర్పడి పార్టీ కార్యకలాపాలు, మున్సిపల్‌ సమావేశాలకు సైతం వైస్‌చైర్మన్‌ హాజరుకాలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

అవిశ్వాసం వైపు అడుగులు

మున్సిపల్‌ పాలకవర్గంలో అవిశ్వాసం వైపు పలువురు కౌన్సిలర్లు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకున్న ఒకే ఒక్క సీటుతో మరికొన్ని సీట్లు తోడవడంతో అవిశ్వాసం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.

వచ్చే ఎన్నికలపై నజర్‌

రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో ఎలాగైనా మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలన్న ఆలోచనలో కౌన్సిలర్లు, ఆ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు ప్రస్తుత చైర్‌పర్సన్‌ భర్త ఓసారి గోవా ట్రిప్పు వేసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వేములవాడ మున్సిపాలిటీలో పాగా వేసి ప్రభుత్వ సహకారంతో గెలుపు సాధించాలన్న సంకల్పం కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. విజయోత్సవాల అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని కౌన్సిలర్లు గుసగుసలాడుతున్నారు.

Advertisement
Advertisement