యమపాశాలు! | - | Sakshi
Sakshi News home page

యమపాశాలు!

Published Thu, Jun 13 2024 12:34 AM | Last Updated on Thu, Jun 13 2024 12:44 AM

యమపాశ

మార్కాపురం/బేస్తవారిపేట: వెలుగునిచ్చే కరెంటు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు తీస్తుంది.. మరికొన్ని జీవితాలను అంధకారం చేస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా విద్యుత్‌ తీగలు యమపాశాలుగా మారే ప్రమాదం ఉంది. మనిషి జీవనయానంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విద్యుత్‌ను సక్రమంగా వినియోగించుకోవడంపై అవగాహన కలిగి ఉండాలని విద్యుత్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ప్రమాదాలు ఇలా..

వర్షకాలంలో ఈదురుగాలులతో విద్యుత్‌ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోయి కరెంట్‌ సరఫరా అవుతుండటంతో పశువులు, ప్రజలు షాక్‌తో మృతి చెందుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ సరైన వైరింగ్‌ లేకపోవడంతో ఏమరపాటుతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనుమతి లేకుండా ఫ్యూజులు మార్చే సందర్భంలో కరెంట్‌ సరఫరా కావడంతో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో పొలాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు పంటలకు నీరు పెట్టడానికి వెళ్లి పొరపాటున విద్యుత్‌ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. పొలాల్లో తెగిపడిన విద్యుత్‌ తీగలు, కిందకు వేలాడుతున్న తీగల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇళ్ల వద్ద, పంట పొలాల్లో విద్యుత్‌ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో బోర్ల కింద పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్‌ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశాలు ఉండటంతో రైతులు, పొలాల్లోకి జీవాలను మేత కోసం తోలుకెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ అధికారులు సూచిస్తున్నారు.

6 నెలల్లో ఆరుగురు మృతి

పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకూ ఉన్న 14 మండలాల్లో పలువురు రైతులు, కూలీలు, విద్యుత్‌ సిబ్బంది 6 నెలల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

● జనవరి 9న రాచర్ల మండలంలోని పలుగుంటిపల్లెలో బోరు మోటారు కేబుల్‌ తగిలి వృద్ధుడు చనిపోయాడు.

● ఫిబ్రవరి 12న రాచర్ల మండలం అక్కపల్లి గ్రామంలో మొక్కజొన్న కోసేందుకు వెళ్లిన మహిళా కూలీ యోగమ్మ తీగలు తగిలి విగతజీవిగా మారింది.

● ఫిబ్రవరి 23న కంభం మండలం యర్రబాలెం గ్రామంలో విద్యుత్‌లైన్‌ లాగుతుండగా కరెంటు షాకుకు గురై వెంకటేశ్వర్లు మృతి.

● ఏప్రిల్‌ 3న కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో ఇంట్లో మోటారు వేస్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు.

● ఈనెల 10వ తేదీన గిద్దలూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద విద్యుత్‌ తీగలు వాహనానికి తగిలి అన్నాదమ్ముళ్లు శీలం లోహిత్‌ కృష్ణ, సాయికృష్ణ మృతి చెందారు.

● పొదిలి, కొనకనమిట్ల, కొమరోలు తదితర మండలాల్లో తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి పదుల సంఖ్యలో గేదెలు మృత్యువాతపడ్డాయి.

వర్షాకాలంలో పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదాలు

అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకే ముప్పు

పశ్చిమ ప్రకాశంలో ఆరు నెలల్లో ఆరుగురు మృతి

పదుల సంఖ్యలో గేదెలు మృత్యువాత

చిన్నపాటి జాగ్రత్త చర్యలతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట

తీగలు, స్టార్టర్‌ మరమ్మతులకు సొంత ప్రయత్నాలు తగదు

No comments yet. Be the first to comment!
Add a comment
యమపాశాలు!
1/2

యమపాశాలు!

యమపాశాలు!
2/2

యమపాశాలు!

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement