రాహుల్ గాంధీ టచ్‌లో 200 మంది అధికారులు | Rahul Gandhi Alleges Election Irregularities, Demands CEC Resignation | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ టచ్‌లో 200 మంది అధికారులు

Oct 12 2026 7:37 PM | Updated on Oct 12 2026 7:54 PM

Rahul Gandhi Alleges Election Irregularities, Demands CEC Resignation

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి యువత నిరంతరం పోరాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. సత్యం మన వైపు ఉంది.. ఆగకండి, ప్రతిరోజూ పోరాటం కొనసాగించండి అని దేశ యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నికల వ్యవస్థలోని అక్రమాలను, ఓటు చోరీని ప్రశ్నిస్తున్న యువతను ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఢిల్లీని ఒక కోటలా మార్చేసింది. దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించి, యువతను, ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోంచి ప్రజలను బలవంతంగా దింపేస్తున్నారు. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఓటు హక్కు కోసం ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులతో దాడులు చేయిస్తూ, మరోవైపు బీజేపీ,ఆర్‌ఎస్ఎస్ శ్రేణులకు స్వేచ్ఛనిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన ప్రదర్శనల్లో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ .. మీరు చేసింది తప్పు. కానీ ఈ ఓటు చోరీ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో మాకు తెలుసు. మీ పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వ సాక్షిగా మారండి. దేశానికి, రాజ్యాంగానికి సేవ చేసేందుకు ఇప్పటికైనా తప్పుకోండి. మీరు రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.  

దేశవ్యాప్తంగా వివిధ వేదికలపై జరుగుతున్న ఉద్యమాలన్నీ వేర్వేరు కాదని, అవన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఒకే ఒక్క బృహత్ ఉద్యమంలో భాగమని రాహుల్ స్పష్టం చేశారు. దేశం మొత్తం ఒక్కటిగా ముందుకెళ్తోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అందరి ఏకైక లక్ష్యమని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ,ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీరుపై అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన 200 మందికి పైగా అధికారులు కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో పాటు పోలీసు బలగాల్లోని 50 శాతం మంది సిబ్బంది తమ పోరాటం సరైనదేనని భావిస్తూ, లోపలి నుంచి సమాచారాన్ని అందిస్తున్నారని ఆయన వెల్లడించారు.

దేశంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య నిష్పాక్షికత లోపించడంపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కలసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ అంశంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తున్నామని, రాజ్యాంగ బద్ధమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని రాహుల్ గాంధీ ఘంటాపథంగా చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement