
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సహనం కోల్పోయారు.
భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దన్నందుకు అసహనం
కౌంటర్ ఇవ్వడం కాదు.. నేను తలచుకుంటే నీపై కేసు పెట్టలేనా? అంటూ హెచ్చరిక
మునగపాక: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సహనం కోల్పోయారు. సందర్భాన్ని బట్టి ఓర్పు, సహనంతో నియోజకవర్గ ప్రజలను సముదాయించాల్సిన ఆయన విరుచుకుపడ్డారు. భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దు.. నగదు చెల్లించాలని ఓ బాధితుడు కోరడమే ఆయన ఆగ్రహానికి కారణం. జిల్లాలోని మునగపాక జనసేన కార్యాలయం ఆవరణలో గురువారం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా పరిహారం కింద నగదు అకౌంట్‌లో జమచేయాలని కోరారు. తిమ్మరాజుపేటకు చెందిన తనకాల జగ్గారావు మాట్లాడుతూ.. తాను టీడీఆర్ బాండ్ల కోసం అనకాపల్లిలో వాకబు చేశానని.. ఈ బాండ్లు అమ్ముకోవడం కష్టతరమని చెప్పారని.. ఇలా అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందించాలని కోరారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జోక్యం చేసుకుని.. టీడీఆర్ బాండ్లను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అనకాపల్లిలో తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకోలేమని అనడం సరికాదంటూ బెదిరింపు ధోరణలో చెప్పారు.
దీంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో ఎమ్మెల్యే సహనం నశించి.. ‘ఉండు.. నువ్వుండు.. ఆగమంటున్నానా.. కౌంటర్ ఇవ్వడం కాదు. నేను తలచుకుంటే నీపై కేసు పెట్టలేనా?’ అని మండిపడ్డారు. నిర్వాసితుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడం సరికాదంటూ హెచ్చరించారు. విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. వీఎంఆర్‌డీఏ ఎక్కడైనా భూములను సేకరించేటప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తుందని.. ఇక్కడ కూడా ఇస్తారేమోనని విజయ్ అన్నారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు నగదు రూపంలో పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.