వైఎస్సార్‌సీపీతోనే సామాన్యులకు రాజ్యాధికారం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే సామాన్యులకు రాజ్యాధికారం

Published Fri, Nov 17 2023 1:04 AM

- - Sakshi

● ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ● అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే ● మీడియా సమావేశంలో జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

రాజాం సిటీ/వంగర: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే సామాన్యులకు రాజ్యాధికారం దక్కిందని జెడ్పీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి తోడ్పాటునిస్తూ సామాజిక సాధికారత సాధించిందని వెల్లడించారు. రాజాంలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని వెల్లడించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ పటంలో విజయనగరానికి అరుదైన గుర్తింపునిచ్చారన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల, జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రూ.150 కోట్లతో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వంటి విద్యాసంస్థలను నెలకొల్పి విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేశారన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీరోగులకు సేవలందించేందుకు డయాలసిస్‌ కేంద్రాన్ని నిర్మించారన్నారు. దీనిని త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అలాగే, ఉద్దానం వాసులకు రూ.800 కోట్లతో సురక్షితమైన తాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు బాసటగా నిలిచారన్నారు. మూలపేటలో పోర్టు నిర్మాణం చేపట్టి పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేశారన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేస్తూ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నారన్నారు. 2024 సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, జగన్‌ వస్తే పేదలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు.

బీసీలను విస్మరించిన టీడీపీ

గత టీడీపీ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ఒక్కశాతం ఓటు బ్యాంకు ఉన్న క్షత్రియ వర్గీయులకు అందలం ఎక్కించడంకోసం ఓ బీసీ మహిళను మంత్రి పదవినుంచి తప్పించారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర వంటి గిరిజన నేతలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక సాధికారతను చేతల్లో చూపించారన్నారు.

● ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందించి, ఆయా కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపిన ఘనత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని తెలిపారు. అందుకే.. మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారన్నారు.

● ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనించాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. కోవిడ్‌ కష్టకాలంలో ప్రజల ప్రాణాలను రక్షించి దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి, రాజాం నియోజకవర్గం పరిశీలకుడు పేరాడ తిలక్‌, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, వైఎస్సార్‌ సీపీ యువనాయకులు తలే రాజేష్‌, కంబాల సందీప్‌, జెడ్పీటీసీ సభ్యుడు బండి నర్సింహులు, వైఎస్సార్‌ సీపీ రాజాం రూరల్‌, టౌన్‌ కన్వీనర్లు లావేటి రాజగోపాలనాయుడు, పాలవలస శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ నక్క వర్షిణి, సర్పంచ్‌ నక్క తవిటమ్మ, పార్టీ నాయకులు, కార్యర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement