మాజీ మంత్రి డొంబురుధర్ ఉలక కన్నుమూత
రాయగడ: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక (87) మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జిల్లాలోని బిసంకట్‌క్ శాసనసభ నియోజకవర్గం నుంచి 1974, 1977, 1995, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. ఒకసారి రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మూడో కొడుకు నీలమాధవ ఉలక బిసంకటక్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేశారు. డొంబురు మృతిపై పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు.
డొంబురుధర్ ఉలక మృతికి సంతాపం
పర్లాకిమిడి: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక మృతికి గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, బిజయ పట్నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసంత పండా సంతాపం తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కర్లకొన గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్ధన్ పట్నాయక్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులను నిర్వహించేందుకు గుణుపూర్ వెళ్లిన ఆయన, విధుల అనంతరం తిరిగి తన స్వగ్రామైన రామనగుడకు మంగళవారం బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో కర్లకొన గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని అక్కడివారు కొలనార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు.
అనుమానాస్పద స్థితిలో
వివాహిత మృతి
కొరాపుట్/మల్కన్‌గిరి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు అగ్నికి ఆహుతైన విషాదకర ఘటన కొరాపుట్ జిల్లాలో జరిగింది. మల్కన్‌గిరి జిల్లా బెంగాలి క్యాంప్ ఎంపీ–10కి చెందిన గగన్ మండల్ కుమార్తె శివాని సింగ్(21)ని పుజారిపుట్ గ్రామానికి చెందిన చెందిన ప్రభాస్‌సింగ్‌తో ఈ ఏడాది మార్చి 12న వివాహం జరిగింది. కొద్దిరోజులయ్యాక అత్తారింట్లో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి బెంగాలి క్యాంపులోని తన నివాసంలో శివాని అనుమానాస్పద స్థితిలో మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆశా కిరణ్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. వరకట్నం వేధింపులు వల్లే తమ కుమార్తె చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రభాస్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కోమట్లపేట సమీపంలో బుధవారం బైక్, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కస్తూరీనగర్ రెండో లైన్‌లో నివాసముంటున్న సహజాద్ అలాం వెల్డింగ్ పనులు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం ఉదయం జేకేపూర్‌లోని ఒక ఇంట్లో వెల్డింగ్ పనులు చేసేందుకు బయలుదేరాడు. కోమట్లపేట వచ్చే సరికి ఆవు అడ్డంగా రావడంతో తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మినీ ట్రక్‌ను బలంగా ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన అలాంను చందిలి పొలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment