బాలలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం | Sakshi
Sakshi News home page

బాలలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం

Published Tue, Nov 21 2023 1:28 AM

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు  - Sakshi

కృష్ణలంక(విజయవాడతూర్పు): బాలల హక్కులను పరిరక్షించి బంగారు భవిష్యత్తును అందించడంతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌ పిలుపునిచ్చారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ (సీఆర్‌ఏఎఫ్‌), జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం–బాలల హక్కులు రక్షిద్దాం, దత్తత ద్వారా తల్లిదండ్రులు–బాలల హక్కు పోస్టర్లను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బాలల హక్కుల చట్టాలను సమర్థంగా అమలు చేసినప్పుడే చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందించగలుగుతామన్నారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నప్పటికీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వీటిని పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులు, చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అడిషనల్‌ డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ బాలలతో పనిచేయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.ఉమాదేవి మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు బాలల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ అవుతు శైలజారెడ్డి, ఎస్సీపీసీఆర్‌ మెంబర్‌ రాజేంద్రప్రసాద్‌, దిశ ఏసీపీ వీవీ నాయక్‌, చైల్డ్‌రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌, ఐసీడీఎస్‌ సీడీపీవోలు జి.మంగమ్మ, కె.నాగమణి, అంగన్‌వాడీ సూపౖర్‌వైజర్లు, కార్యకర్తలు, ఏపీఎస్‌ఆర్‌ఎంసీ హైస్కూల్‌, సీవీఆర్‌ హైస్కూల్‌, వీఎం రంగా బాలికల పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములవుదాం

రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు

మల్లాది విష్ణువర్థన్‌

Advertisement
Advertisement