ఒకటో తేదీ నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

ఒకటో తేదీ నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు

Published Mon, Mar 27 2023 1:32 AM

-

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ చైత్రశుద్ధ ఏకాదశి నుంచి 5వ తేదీ పౌర్ణమి వరకు జరగునున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ఆది దంపతులకు రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. ఇక ఆరో తేదీ నుంచి 8వ తేదీ వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలను వైదిక కమిటీ నిర్వహిస్తుంది. ఒకటో తేదీ శనివారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరిస్తారు. సాయంత్రం గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, ద్వజారోహణం జరుగుతుంది. 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 10.30 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య కల్యాణోత్సవం జరుగుతుంది. 5వ తేదీ పూర్ణాహుతి, అవభృత స్నానం, ద్వజావరోహణతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

వాహన సేవలు ఇలా..

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదు రోజుల పాటు ఆది దంపతులకు వివిధ వాహన సేవలు జరుగుతాయి. ఒకటో తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు వెండి పల్లకీపై ఆది దంపతులు నగర పురవీధుల్లో విహరిస్తారు. 2న రావణ వాహన సేవ, 3న నంది వాహన సేవ, 4న సింహ వాహన సేవ, 5న వెండి రథోత్సవం నిర్వహిస్తారు.

Advertisement
Advertisement