కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం దేవన్‌పల్లి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అఖిల భారతీ ప్రభోధ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ (ఏబీపీఎస్) జాతీయ అధ్యక్షుడు ఎంఎస్‌ఆర్ ప్రబోధ సుమేర్ అన్నారు. దేవన్‌పల్లిలో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.94,679 విలువ గల చెక్కును గ్రామస్తులకు బుధవారం అందజేశారు. గ్రామీణ ప్రాంత యువతలో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో నవంబర్ 8, 2026న ఏబీపీఎస్ ఆధ్వర్యంలో దేవనపల్లిలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు సుమేర్ వెల్లడించారు. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ గంగాసాయిలు, ఏబీపీఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ రామావత్, ఉపాధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


