ప్రజాస్వామ్యాన్నీ డీనోటిఫై చేస్తారు | PM Narendra Modi will denotify democracy tomorrow, slams Abhijeet Dipke | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్నీ డీనోటిఫై చేస్తారు

Oct 13 2026 6:01 AM | Updated on Oct 13 2026 6:01 AM

PM Narendra Modi will denotify democracy tomorrow, slams Abhijeet Dipke

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే 

జంతర్‌మంతర్‌ రద్దుపై విమర్శ 

ఛత్రపతి సంభాజీనగర్‌: ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కేటాయించిన జంతర్‌మంతర్‌ మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై చేసే ప్రమాదం ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే సోమవారం వ్యాఖ్యానించారు. డీనోటిఫికేషన్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశమంతా జంతర్‌మంతర్‌ అవుతుందని హెచ్చరించారు. 

‘‘జంతర్‌ మంతర్‌ను అధికారిక ప్రొటెస్ట్‌ సైట్‌ కాదంటున్నారు. నిజమే. పిరికి నియంత దాన్నిప్పుడు యుద్ధభూమిలా మార్చేశాడు. అబ్‌ పూరా దేశ్‌ జంతర్‌మంతర్‌ బనేగా’’అంటూ దీప్కే ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రజాస్వామ్యాన్ని కూడా డీనోటిఫై’చేస్తారని వ్యాఖ్యానించారు. ‘‘నియంత అసలు సమస్య నిరసన ప్రదర్శనల కేంద్రం కాదు. ప్రజలు నిరసనలు చేస్తున్నారన్నదే’’అని విమర్శించారు. 

ఢిల్లీ పోలీసులు టార్చర్‌ పెట్టారు... 
ఢిల్లీ పోలీసులు తనను, కుటుంబ సభ్యులను మానసిక హింసకు గురిచేశారని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. అక్టోబరు పదిన తనను అదుపులోకి తీసుకున్న సందర్భంలో కుటుంబసభ్యులు ఎవరికీ తన ఆచూకీ తెలియనివ్వలేదని చెప్పారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉండగానే దీప్కే నానమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్తను పోలీసులు తనకు తెలిపినప్పటికీ గ్రామంలో ఉన్న బంధువుకు ఫోన్‌ చేస్తానంటే అనుమతించలేదని, అతడి నంబరు తీసి ఇచ్చేందుకైనా ఫోన్‌ ఇవ్వాలన్నా నిరాకరించారని ఆరోపించారు. 

న్యాయవాదితో మాట్లాడేందుకు తనకున్న హక్కును కూడా తోసిపుచ్చారని ఆరోపించారు. అక్టోబరు పది నాటి నిరసన ప్రదర్శనల కోసం బయలుదేరిన తనను విమానంలోనే అదుపులోకి తీసుకున్నారని, తల్లిదండ్రులకు గానీ, న్యాయవాదికి కానీ తన ఆచూకీ తెలపలేదని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు మాత్రం దీప్కే నానమ్మ మరణవార్తను అతడికి చేరవేశామని, సహాయం ఏదైనా అవసరమని అడిగితే అతడు తిరస్కరించాడని ఆరోపిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు.

 దీనిపై ‘‘నానమ్మ మరణవార్తను పోలీసులు నాకు చెప్పి ఉంటే వాళ్లు మధ్యాహ్నం 3.30 గంటలకు అరెస్ట్‌ పేపర్లతో ఎందుకు వచ్చారు? దానిపై సంతకం పెట్టాలని బలవంతపెట్టారు’’? అని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. తల్లిదండ్రులతో మాట్లాడమని పోలీసులు చెబితే.. వారి ఆరోగ్యం సరిగా లేనందున తాను నానమ్మతోపాటు ఉండే బంధువుకు కాల్‌ చేయమని అడిగానని దీప్కే వివరించారు. 

ఢిల్లీ పోలీసులు ఇందుకు నిరాకరించారని, అన్నారు. నాతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి తీసుకురావాలన్నది వారి ఉద్దేశమని విమర్శించారు. నానమ్మ మరణ వార్త చెప్పేందుకు వారు మూడు కెమెరాలతో రావడమే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు ఎడిట్‌ చేసిన వీడియో ప్రసారం చేస్తున్నారు. దమ్ముంటే మొత్తం వీడియో చూపమనండి. నా ప్రాథమిక హక్కులకు భంగం చేసిన విషయం తెలుస్తుంది’’అని సవాలు విసిరారు. ‘‘మోదీ నియంతృత్వం నశించేంతవరకూ పోరాడతాను’’అని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement