కొత్త ఫ్లైఓవర్‌కు అడ్డంగా బారికేడ్లు.. క్రేన్‌తో జనాల దండయాత్ర | Mumbais Sion Bridge Ready But Shut Locals Bring Crane | Sakshi
Sakshi News home page

కొత్త ఫ్లైఓవర్‌కు అడ్డంగా బారికేడ్లు.. క్రేన్‌తో జనాల దండయాత్ర

Oct 21 2026 7:27 PM | Updated on Oct 21 2026 7:41 PM

 Mumbais Sion Bridge Ready But Shut Locals Bring Crane

ముంబై: స్కూల్లో జెండా వందనం రోజు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి అతిథిని పిలుస్తారు. పిల్లలు అందరూ ఉదయాన్నే వచ్చి జెండా వందనం కోసం గంటలకొద్దీ ఎదురుచూస్తుంటారు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నా అలాగే లైనులో కూర్చొని వేచి చూస్తుంటారు. ఆ అతిథి తన పనులు అన్నీ అయ్యాక ఎప్పుడో వచ్చి జెండా ఎగరేసి వెళ్తాడు. ఇటువంటి ఘటనలే అనేకం జరుగుతుంటాయి. రోడ్డు, వంతెనలు, నీళ్ల ట్యాంకుల ప్రారంభోత్సవానికి అతిథులు ఎప్పుడు వస్తారో వారికే తెలియదు. ఇటువంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది.  

పూర్తిగా నిర్మాణం పూర్తయి వాహనాల రాకపోకలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికారిక ప్రారంభోత్సవం కోసం మూసి ఉంచిన సియాన్‌ వంతెనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖుల కోసం అధికారులు ఎదురుచూడటంపై నిరసనగా స్థానికులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బుధవారం క్రేన్‌తో అక్కడికి చేరుకున్నారు. వంతెనకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, వాహనాల రాకపోకలను ప్రారంభించాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

ప్రారంభోత్సవం కోసం ఎదురుచూపులు
వంతెన నిర్మాణం పూర్తయి, వాహనాల రాకపోకలకు అనువుగా ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రముఖుల సమక్షంలో అధికారికంగా ప్రారంభించేందుకు సమయం ఖరారు చేయాల్సి ఉండటమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వంతెనను ప్రారంభించేందుకు గతంలో 4 గడువులు ప్రకటించినప్పటికీ, అందులో ఏ గడువుకూ పూర్తి కాలేదు. తాజాగా అక్టోబర్‌ 15నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది కూడా నెరవేరలేదు.

గత వారమే వంతెనకు సంబంధించిన తుది పనులు పూర్తయ్యాయని, ప్రజల వినియోగానికి అనుమతించే ముందు ట్రాఫిక్‌ పోలీసుల నుంచి అభ్యంతరం లేదనే ధ్రువీకరణ పత్రం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వంతెనను ఇంకా ఎందుకు తెరవలేదనే విషయంపై బీఎంసీ బహిరంగంగా వివరణ ఇవ్వలేదు.

2 ఏళ్లుగా ట్రాఫిక్‌ ఇబ్బందులు
కొత్త వంతెన 1912లో నిర్మించిన పాత సియాన్‌ రైల్వే ఓవర్‌బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా నిర్మించారు. 2019లో ఐఐటీ బాంబే నిర్వహించిన నిర్మాణ భద్రతా తనిఖీలో పాత వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని కూల్చి, కొత్త వంతెన నిర్మించేందుకు 2024 ఆగస్టు 1న వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి కుర్లా మధ్య ప్రతిపాదిత 5, 6వ రైల్వే లైన్లకు అనువుగా కొత్త వంతెనను ఒకే విస్తీర్ణంతో నిర్మించారు. బీఎంసీ, సెంట్రల్‌ రైల్వే సంయుక్తంగా సుమారు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ముంబైలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తూర్పు, పడమర ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గంగా ఈ వంతెనకు ప్రాధాన్యం ఉంది.

వీఐపీ సంస్కృతిపై విమర్శలు
వంతెన ప్రారంభంలో జాప్యాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా వారికి తోడయ్యారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రముఖుల కోసం ఎదురుచూసే సంస్కృతి అడ్డంకిగా మారిందని వారు విమర్శించారు. రిబ్బన్‌ కటింగ్‌ కార్యక్రమం కోసం వేచి ఉండటానికి బదులుగా, క్రేన్‌తో బారికేడ్లను తొలగించి వంతెనను తెరవాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారిని నిలువరించారు.

వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఇప్పటివరకు కొత్త తేదీని ప్రకటించలేదు. అధికారికంగా ప్రారంభించే వరకు వాహనదారులు ప్రస్తుత మార్గాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రారంభోత్సవ తేదీని ఎప్పుడు ఖరారు చేస్తారు, వంతెనపై రాకపోకలకు ఎప్పటి నుంచి అనుమతిస్తారనే అంశాలపై ఇప్పుడు దృష్టి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement