బంధం.. బలహీనం! | The free life is full of dangers | Sakshi
Sakshi News home page

బంధం.. బలహీనం!

Jun 25 2025 4:47 AM | Updated on Jun 25 2025 4:47 AM

The free life is full of dangers

మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు

కన్నవాళ్లనే కడతేరుస్తున్న పిల్లలు

స్వేచ్ఛాయుత జీవితం మోజులో ఘోరాలు

ప్రియుడితో ఫోన్‌ మాట్లాడొద్దని మందలించిన కన్న తండ్రిని.. తల్లి, అక్కతో కలిసి కొట్టి చంపిన కూతురు.. మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన

ఆస్తి వివాదం కోసం కన్న తండ్రి ఎదుటే సోదరుడిని తుదముట్టించిన చెల్లెళ్లు.. జగిత్యాల జిల్లాలో ఘోరం 

ప్రేమకు అడ్డు వస్తోందని కన్నతల్లినే ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా హైదరాబాద్‌ జీడిమెట్ల పరిధిలో దారుణం  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకు అయినవాళ్లను, ఆప్తులను అంతమొందించే పరిస్థితులు పెరిగిపోతున్నాయ్‌. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా.. మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా అంతర్థానమవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్నచిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. 

కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటంలేదు. తల్లి లేదు.. తండ్రి లేడు.. తోబుట్టువులైనా.. కట్టుకున్న వాళ్లైనా.. బంధనాల్లాంటి బంధాలు మాకొద్దు.. మా లైఫ్‌.. మా ఇష్టం.. మా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. అనే తీరు నేడు ఎక్కువైపోయింది. 

రక్తపాతమే కావాలా?
ఫోన్‌ మాట్లాడొద్దన్నారని.. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని.. కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో వారికి వేరే ఆప్షన్లు ఉన్నప్పటికీ, రక్తపాతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేస్తే జైలుకు వెళతామనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి ఘటనల వెనుక కారణాలు అన్ని కేసుల్లో ఒకేలా ఉండవు. పరిస్థితులు, అవసరాలను బట్టి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. 

అయితే, ఇవేవీ ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు మాత్రం కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, విభ్రాంతికరమైన ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.  

పిల్లల్లో పెడాలోచనలు ఎందుకు? 
మా పిల్లలు మాట వినరు.. సరిగ్గా చదవరు.. ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అతిశయోక్తి కాదు. మారుతున్న ప్రపంచంతోనే అందరి అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తోంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే... స్మార్ట్‌ ఫోన్‌ అనే సమాధానం ఠక్కున వస్తుంది. కొంతవరకు ఇది నిజమే అయినా.. ఇతర కారణాలూ ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండటంలేదు. 

వారితో ప్రేమగా మాట్లాడి, అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి.. తమకు కావాల్సింది స్మార్ట్‌ ఫోన్‌లో వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే.. అది నిజమో, అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్‌ చేయడం వారికి నచ్చడంలేదు. 

బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని.. ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి.. వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే, అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలాకాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు.. ఏదీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటివారు పర్యవసనాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి? 
తమ పిల్లల ప్రతి చర్యకూ తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేయకూడదు.. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్‌ చేయాలి. పిల్లలను అదేపనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు.. లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నాం అనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యేరీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి.  

వ్యక్తిత్వ లోపాలే కారణం 
అకారణంగా హత్యలకు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవల్స్‌ తక్కువ ఉంటాయి. ఈ బెడద నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచన వల్లే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలోనే లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి, ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటివారిలో చాలామంది.. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఒకరకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై ఉంటారు. వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది.– వీరేందర్, సైకాలజిస్ట్‌

కనుమరుగవుతున్న బంధాలను కాపాడుకోవాలి 
కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్యకేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్‌ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచినవారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. 

కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం లేనప్పుడు ప్రేమ ఒక వ్యసనంగా మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్‌ ఎడ్యుకేషన్‌ అందించడం ఇందుకు ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారితో బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రైవసీని గౌరవించాలి.      – సైకాలజిస్ట్‌ విశేష్‌ 

విలువలు నేర్పకపోవడం వల్లే.. 
చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వాళ్లని సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణాలు.అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారనేది చాలా ముఖ్యం. చాలా  మంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడంలేదు. బాల్యం నుంచే విలువలతోపాటు నేరాలు–చట్టాలపై అవగాహన కల్పించాలి.        – డా. మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ  

కుటుంబ సభ్యులపైనే దాడులు, హత్యలకు కారణాలివీ..
నియంత్రించడం (ఏదైనా వద్దు అని చెప్పడం, ఫోన్‌ తీసేసుకోవడం వంటివి) 38%
ఆస్తి వ్యవహారాలు  10%
విభేదాలు 8%
కోపం, క్షణికావేశం 8%
స్వేచ్ఛాయుత జీవితం కోరుకోవడం 7% 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement