ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడటం ముంబైలో తీవ్ర కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ముంబైలోని జూహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడి కారులో కూర్చున్న సమయంలో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు.
దుండగులు జరిపిన కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ ఎడమ చేతికి గన్ పౌడర్,కారు అద్దాల పెంకులు (గ్లాస్ షార్డ్స్) తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి బుల్లెట్ గాయాలు కాలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం నానవతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ కోలుకుని ఇంటికి తిరిగి రాగా, ఆయన డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏక్‌నాథ్ షిండే
ఈ నేపథ్యంలో.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేరుగా టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లారు. అక్కడ టైగర్ ష్రాఫ్‌తో పాటు ఆయన తల్లి అయేషా ష్రాఫ్‌ను కలిసి పరామర్శించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోల్లో టైగర్ ష్రాఫ్ చేతికి కట్టుతో (బాండేజీలతో) కనిపించారు. అనంతరం హీరోయిన్ దిశా పటానీ కూడా టైగర్ ష్రాఫ్ నివాసానికి వచ్చి పరామర్శించారు.
నిందితులను ఉపేక్షించే ప్రసక్తే లేదు: షిండే
ఈ సందర్భంగా ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బహిరంగ బెదిరింపులకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులను ఏ రూపంలోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
#WATCH | Mumbai | Visuals from inside the residence of Tiger Shroff as Maharashtra Dy CM Eknath Shinde arrived to visit him following an incident of firing at his car, injuring his driver The actor is safe and has not sustained any gunshot injuries, as per Mumbai Police (Visuals source: Shivsena PR)
— ANI (@ANI) October 18, 2026
సోషల్ మీడియాలో విమర్శలు
జూహూ నివాసంలో టైగర్ ష్రాఫ్‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. భేటీ సమయంలో టైగర్ ష్రాఫ్ పైచొక్కా లేకుండా (షర్ట్ లేకుండా) ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ఇది కేవలం పీఆర్ స్టంట్ మాత్రమేనని మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు లేదా గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు ఎదుర్కొన్న సెలబ్రిటీ ప్రవర్తనలా ఇది లేదని, కావాలనే పబ్లిసిటీ కోసం లేదా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి చేసిన 'పీఆర్ స్టంట్' లాగా ఉందంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ప్రాణాలతో పోరాడుతున్న డ్రైవర్‌ను పట్టించుకోకుండా నేరుగా హీరో ఇంటికి వెళ్లడంపై కూడా నెటిజన్లు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.
ఇదీ చదవండి : ‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్


