దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు కలిసికట్టుగా పనిచేయాలి
2029 ఆఖరు నాటికి ‘డ్రగ్స్ రహిత భారత్’ మన లక్ష్యం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలు భవిష్యత్ తరాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులకు డ్రగ్స్ దందాతో నిధులు అందుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌కు వ్యతిరకంగా దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు కలిసికట్టుగా పనిచేయాలని, 2029 ఆఖరు నాటికి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే మనందరి లక్ష్యమని ఉద్ఘాటించారు.
పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు అమిత్‌షా నివాళులర్పించారు. ‘మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం’అనే ఇతివృత్తంతో వేర్వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన 90 మంది పోలీసు రైడర్లు పాల్గొన్న మోటార్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026లోని మిగిలిన నెలలతో పాటు 2027, 2028, 2029 సంవత్సరాలను కూడా మాదకద్రవ్యాలపై ఐక్య పోరాటానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారాన్ని ఒక ప్రధాన జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా అభివర్ణించారు. మాదకద్రవ్యాల దురి్వనియోగం భావి తరాలకు ముప్పు కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతుందని వెల్లడించారు. భావి తరాలను కాపాడుకోవాలంటే డ్రగ్స్ భూతాన్ని అంతం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఎన్నికల హింసను అరికట్టడంలో విజయం
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలిజాన్ని 2026 మార్చి 31వ తేదీ నాటికి పూర్తిగా నిర్మూలించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. నక్సల్స్ సమస్యను ఎదుర్కోవడంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా వంటి దళాల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. 1981 నుండి 2026 మార్చి నెల వరకు నక్సలిజానికి సంబంధించిన హింసాత్మక ఘటనల్లో 3,600 మందికి పైగా భద్రతా సిబ్బంది, దాదాపు 13,700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఎన్నికలు, పండుగలు, నిరసనలు లేదా సరిహద్దు భద్రతా విధుల వంటి ప్రతి సందర్భంలోనూ కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. పశి్చమ బెంగాల్‌లో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేలా చూడటం ద్వారా మన భద్రతా సిబ్బంది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారని అమిత్ షా చెప్పారు.
ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఎన్నికల హింసను అరికట్టడంలో విజయం సాధించామని తెలిపారు. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు, సరిహద్దులను రక్షించేందుకు పోలీసులు, జవాన్లు ప్రాణాలను అర్పించకపోయి ఉంటే నేడు మనం ఏ స్థితిలో ఉండేవాళ్లమో ఎవరూ ఊహించలేరని చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మహేష్ దీక్షిత్ మాట్లాడుతూ... గత ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 36,852 మంది పోలీసు సిబ్బంది దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు.


