
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే..
.. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్‌లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్‌బాయ్ కూడా అదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు.
అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.
40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.

‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్‌ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది.