ఎన్‌హెచ్‌పై పోలీసుల తనిఖీ | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌పై పోలీసుల తనిఖీ

Published Fri, Apr 19 2024 1:35 AM

- - Sakshi

గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్సై కమలాకర్‌ ఆధ్వర్యంలో పస్రా ఎన్‌హెచ్‌పై గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వచ్చి వెళ్లే ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై కమలాకర్‌ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకోవటానికి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇద్దరి రిమాండ్‌

వాజేడు: విద్యుత్‌ తీగలు అమర్చి ఒకరి ప్రాణం పోవడానికి కారణమైన ఇద్దరిని రిమాండ్‌ చేసినట్లు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్‌, వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు గురువారం కేసు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని చింతూరు గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య పూజారి సురేష్‌తో కలిసి తన మొక్కజొన్న పంటను రక్షించుకోవడానికి మార్చి 27న విద్యుత్‌ తీగలను అమర్చాడు. రాత్రి సమయంలో అటుగా మంచినీళ్ల కోసం వెళ్లిన అభినయ్‌ విద్యుత్‌ తీగలు తగిలి గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. అందుకు కారణమైన కన్నెబోయిన సమ్మయ్య, పూజారి సురేష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. రైతులు, వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థులకు మెరుగైన

సౌకర్యాలు కల్పించాలి

వెంకటాపురం(కె): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ పోచం అన్నారు. మండల పరిధిలోని ఆలుబాక, వెంకటా పురం ఎస్టీ బాలుర వసతి గృహాలను, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లో ఉన్న బాత్‌ రూమ్‌లు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వి ద్యార్థుల హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేశా రు. స్టోర్‌ రూమ్‌లో ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో మరమ్మతులకు గురైన బాత్‌రూమ్‌లు, విద్యుత్‌ మరమ్మతులు పనులు చేయించాలన్నారు.

ఆరోగ్యంపై అవగాహన

కల్పించడం కోసమే..

కాంగ్రెస్‌ నాయకుడు గుడాల శ్రీనివాస్‌

కాటారం (మహదేవపూర్‌): ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంత కాలంగా వ్యాయామం, యోగాపై తన వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని.. అందులో భాగంగానే పోలీసులకు సైతం అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు మహదేవపూర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 15న మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్‌ నృత్యం చేసిన ఘటన వైరల్‌ కాగా అదేరోజు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్‌రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకా జ్‌ నోటీస్‌ జారీ చేశారు. దీనిపై గురువారం గుడాల శ్రీనివాస్‌ సోషల్‌ మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. 30 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ మంచి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. కరోనా బాధితులు గుండుపోటుతో మృతిచెందడం తనను బాధించిందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులను అడిగి పలు సలహాలు తీసుకున్నానని చెప్పారు. ఆ విషయాలను నలుగురికి చెపుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తూ ఇంటి సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులు పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గిట్టని వారు కొందరు దురుద్దేశంతో అబద్ద పు మాటలు ప్రచారం చేస్తున్నారని ఆరో పించారు. తన సంజాయిషీతో సంతృప్తి చెందకపోతే పార్టీ జిల్లా బాధ్యులు తీసుకోబోయే చర్యలను గౌరవిస్తానని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement