ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి దానికి ఓ విలువ ఉంటుంది. అలాగే కొన్ని కనిపించని వాటికి కూడా విలువ అపారం. వాటిలో ప్రధానమైనది వ్యక్తి పరువు. మరీ ముఖ్యంగా ఈ పరువు వ్యక్తిగత భావావేశాలతో ముడిపడి ఉంటుంది. అది ఎంతలా అంటే పరువు కోసం ప్రాణాలు తీయడమో, తీసుకోవడమో అన్నంతగా ఆధారపడుతుంది. అందుకనే కదా తరచూ మనం పరువు హత్యలు, ఆత్మహత్యలు తదితర దారుణాలు వింటూ ఉంటాం. ఆ పరువుకి సంబంధించిన విలువ తెలియచేయడానికి అల్లుకున్న కథే ఎన్న విలై.
తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. సజీవ్ పఝూర్ తాను రాసుకున్న కథను తానే తెర కెక్కించారు. వర్ధమాన తమిళనటుడు కరుణాస్, మళయాళ నటి నిమిషా సజయాన్ తమ సహజ నటనతో ప్రధాన పాత్రలను పోషించి మెప్పించారు. నిజానికిది ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ సంబంధమున్న కథాంశమిది. అంతలా ఏముందీ కథలో ఓ సారి తెలుసుకుందాం.
(చదవండి: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్ దేవరకొండ)
రామేశ్వరం సముద్ర తీరంలో నీటి అడుగున పాత నాణాలను ఏరుకుని వాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న తవసిముత్తు కథ ఇది. అలా ఓ సారి నాణాలకోసం చూస్తుండగా తవసిముత్తుకు అనుకోకుండా వజ్రాలతో కూడిన విలువైన బంగారు కడియం ఒకటి దొరుకుతుంది. దాని విలువ తెలియక తవసిముత్తు అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారికి ఈ విషయం చెబుతాడు. ఆ పోలిస్ అధికారి దానిని చూసి అత్యాశతో తవసిముత్తుకి తెలియకుండా అందులోని ఓ వజ్రాన్ని కాజేసి ఈ కడియం నకిలీదని తిరిగి తవసిముత్తూకే ఇచ్చేస్తాడు. ఆ తరువాత వజ్రం అసలు విలువ తెలుసుకున్న పోలీస్ మొత్తంగా ఆ కడియాన్ని కాజేయాలన్న కుట్రతో తవసిముత్తుపై లేని దొంగతనం కేసును బనాయించి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతాడు.
ఆ పై ఈ కేసు కోర్టు విచారణకు వెళుతుంది. కడుబీదరికంలో ఉన్న తవసిముత్తు కుటుంబం మొత్తాన్ని ఈ విషయంలో సమాజం దోషిగా చూస్తుంది. అప్పుడే కాంచన అనే లాయర్ తవసిముత్తు కేసును వాదించడానికి ముందుకు వస్తుంది. తవసిముత్తుకు సముద్రంలో దొరికిన ఆ కడియం తన కుటుంబాన్ని చివరికి ఏం చేస్తుందన్న విషయం ఎన్న విలై సినిమాలోనే చూడాలి. పరువు కోసం పాకులాడాలి తప్పులేదు. కాని స్వార్ధంతో ఇతరుల పరువును బజారుపాలు చేయడం ఎంతవరకు సబబు అన్నది ఎంతో హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు దర్శకులు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.
-హరికృష్ణ ఇంటూరు


