కాన్స్‌కు బెంగాలీ ఫిల్మ్‌అరణ్యేర్‌ దిన్‌ రాత్రి | Satyajit Ray Aranyer Din Ratri to be screened in classics section at Cannes Film Festival | Sakshi
Sakshi News home page

కాన్స్‌కు బెంగాలీ ఫిల్మ్‌అరణ్యేర్‌ దిన్‌ రాత్రి

May 9 2025 3:34 AM | Updated on May 9 2025 3:34 AM

 Satyajit Ray Aranyer Din Ratri to be screened in classics section at Cannes Film Festival

∙‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమా సెట్స్‌లో సత్యజిత్‌ రే

‘కాన్స్‌ క్లాసికల్‌ సెక్షన్‌’ విభాగంలో ప్రదర్శన

భారతీయ ప్రముఖ దివంగత దర్శకులు సత్యజిత్‌ రే ఐకానిక్‌ బెంగాలీ ఫిల్మ్‌ ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ (1970) కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది. ఫ్రాన్స్‌లో ఈ నెల 13 నుంచి 24 వరకు 78వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రోత్సవాల తొలి రోజున ‘కాన్స్‌ క్లాసికల్‌ సెక్షన్‌’ విభాగంలో ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమా స్క్రీనింగ్‌ కానుంది. సునీల్‌ గంగోపాధ్యాయ రాసిన ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ నవలను అదే పేరుతో సత్యజిత్‌ రే సినిమాగా తెరకెక్కించారు. ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం 1970 జనవరి 16న ఇండియాలో విడుదల కాగా, 1973 మార్చి 14న యూఎస్‌లో (ఇంగ్లిష్‌లో ‘డేస్‌ అండ్‌ నైట్స్‌ ఇన్‌ ది ఫారెస్ట్‌’) విడుదలైంది.

సౌమిత్రా ఛటర్జీ, సుభాష్‌ ఛటర్జీ, సమిత్‌ భంజా, రబీ ఘోష్, షర్మిలా ఠాగూర్, కబీర్‌ బోస్, అపర్ణ సేన్‌ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలుపోషించారు. ఈ సినిమా కాన్స్‌ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైనట్లుగా కాన్స్‌ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కే రెజల్యూషన్‌లో రీస్టోర్‌ చేశారు. ది ఫిల్మ్‌ ఫౌండేషన్స్‌ వరల్డ్‌ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, ది క్రైటీరియన్‌ కలెక్షన్స్‌ జానస్‌ ఫిల్మ్స్‌ల ఆధ్వర్యంలో ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమా 4కే రెజల్యూషన్‌లో రీ స్టోర్‌ చేయడం జరిగింది. ఈ చిత్రనిర్మాత పూర్ణిమా దత్తా దగ్గర ఉన్న ఈ సినిమా ఒరిజినల్‌ కెమెరా, సౌండ్‌ నెగటివ్‌ల సాయంతో ఈ సినిమా 4కే రెజల్యూషన్‌ వీలుపడింది. గోల్డెన్‌ గ్లోబ్‌ ఫౌండేషన్‌ ఫండింగ్‌ చేసింది. దర్శకులు మార్టిన్‌ స్కోర్సెస్, వెస్‌అండర్సన్‌ ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమాను 4కే రెజల్యూషన్‌లో రూపొందించడానికి కీలక పాత్రలుపోషించారు.

సంతోషం... బాధ: సందీప్‌ రే 
‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ సినిమా కాన్స్‌లో ప్రదర్శితం కానున్న సందర్భంగా సత్యజిత్‌ రే తనయుడు, దర్శకుడు–సంగీత దర్శకుడు సందీప్‌ రే స్పందించారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధగా కూడా ఉంది. ‘కాన్స్‌’లో సినిమా ప్రదర్శితం కానున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో చాలా మంది ఇప్పుడు జీవించి లేకపోవడం బాధగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తీయాలని నాన్నగారు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ‘పథేర్‌ పాంచాలి’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది’’ అని పేర్కొన్నారు.  

కాన్స్‌ ఫెస్టివల్‌కు పూర్ణిమ... షర్మిల 
ఇక ఈ సినిమా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన కానున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాత పూర్ణిమా దత్తా, ఈ చిత్రంలో నటించిన షర్మిలా ఠాగూర్‌ హాజరు కానున్నారు. ఈ చిత్రంలో నటించిన మరో నటి సిమీ గరేవాల్‌కు ఆహ్వానం అందినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారట. ఇక ఈ 78వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు భారతదేశం తరఫున ఎంపికైన ఏకైక చిత్రం ‘హోమ్‌బౌండ్‌’. జాన్వీ కపూర్, ఇషాన్‌ కట్టర్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాకు హైదరాబాదీ వ్యక్తి నీరజ్‌ దర్శకత్వం వహించారు. ‘అన్‌సరై్టన్‌ రిగార్డ్‌’ విభాగంలో ‘హోమ్‌బౌండ్‌’ చిత్రంపోటీ పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement