పెళ్లికోసం ఐదేళ్లు దూరం.. క్షమించండి నాన్న: సల్మాన్‌ ఖాన్‌ | Salman Khan Apologises to Father Salim Khan Recalls Parents Marriage | Sakshi
Sakshi News home page

Salman Khan Apologises: ‘పెళ్లికి తాతయ్య ఒప్పుకోలేదు అందుకే..’

Oct 18 2026 7:15 PM | Updated on Oct 18 2026 7:34 PM

Salman Khan Apologises to Father Salim Khan Recalls Parents Marriage

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బిగ్‌బాస్‌ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి సలీమ్‌ ఖాన్‌కు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. అలాగే తన తల్లిదండ్రుల వివాహాన్ని తాతయ్య ఎందుకు వ్యతిరేకించారు? పెళ్లి తర్వాత ఐదేళ్ల పాటు సలీమ్‌ ఖాన్‌తో ఎందుకు మాట్లాడలేదు? అనే విషయాలను ఆ రియాల్టీ షో వేదికగా గుర్తుచేసుకున్నారు.

బాధపడి ఉంటే క్షమించమని కోరా..
‘ఇటీవలే మా నాన్నకు క్షమాపణలు చెప్పాను. నా ప్రవర్తన వల్ల ఆయన ఎప్పుడైనా బాధపడి ఉంటే క్షమించమని కోరాను. మా అమ్మానాన్నల పెళ్లి విషయంలో మతం అడ్డురాలేదు. మా నాన్న చూడటానికి అందంగా ఉండేవారు. పైగా నటుడు కావాలనుకున్నారు. దీంతో సినిమా వాతావరణంలో తన కుమార్తె ఎలా జీవిస్తుందోనని మా అమ్మ తండ్రి ఆందోళన చెందారు. అందుకే వారి పెళ్లికి అంగీకరించలేదు. అయితే మా అమ్మ తోబుట్టువులందరికీ మా నాన్న అంటే అభిమానం ఉండేది’ అని సల్మాన్‌ తెలిపారు.

పెళ్లి తర్వాత ఐదేళ్ల పాటు..
పెళ్లి తర్వాత ఐదేళ్ల పాటు తన తాతయ్య, తండ్రితో మాట్లాడలేదని సల్మాన్‌ గుర్తుచేసుకున్నారు. తన తమ్ముడు సోహైల్‌ పుట్టిన తర్వాత తాతయ్య స్వీట్స్‌ తీసుకుని ఇంటికి వచ్చారని చెప్పారు. మనవళ్లతో ఇన్నాళ్లూ గడపలేకపోయానని ఆయన బాధపడ్డారని తెలిపారు.

‘అమ్మానాన్నల మధ్య ఎప్పుడైనా గొడవ జరిగి అమ్మ అలిగి పుట్టింటికి వెళ్తే.. తాతయ్య ఆమెను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. సాధారణంగా ఎప్పుడైనా రావచ్చని, కానీ గొడవపడి మాత్రం ఇంటికి రావొద్దని చెప్పేవారు’ అని సల్మాన్‌ వివరించారు.

కాగా సలీమ్‌ ఖాన్‌ 1964లో సుశీలను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె తన పేరును సల్మాగా మార్చుకున్నారు. వీరికి సల్మాన్‌, అర్బాజ్‌, సోహైల్‌, అల్విరా సంతానం. అనంతరం సలీమ్‌ ఖాన్‌ ప్రముఖ నటి, నర్తకి హెలెన్‌ను 1981లో వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో ఈ నిర్ణయాన్ని కుటుంబం అంగీకరించడానికి ఇబ్బందిపడినా.. ఆ తర్వాత సల్మాన్‌, ఆయన తోబుట్టువులు హెలెన్‌ను తమ కుటుంబ సభ్యురాలిగా స్వీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement