డబుల్‌ డోస్‌ వినోదం గ్యారెంటీ | Double occupancy OTT review in telugu | Sakshi
Sakshi News home page

డబుల్‌ డోస్‌ వినోదం గ్యారెంటీ

Aug 23 2026 6:16 AM | Updated on Aug 23 2026 6:16 AM

Double occupancy OTT review in telugu

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’ ఒకటి. ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఆలోచన అన్నది ప్రతి మనిషికీ ఉంటుంది. కానీ అదే ఆలోచన ఎంత వైవిధ్యంగా అవతలవారికి చెప్పామన్న దాంట్లోనే విషయం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసేవారే సినీ దర్శకులు. ఇదే నేపథ్యంలో వచ్చిన ఓ వెరైటీ ఫ్యామిలీ డ్రామా ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’. ఈ సినిమా టైటిల్‌తోనే దర్శకుడు తాను చెప్పాలనుకున్నపాయింట్‌ని ప్రేక్షకుడికి సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. అశ్విన్‌ కందసామి తాను రాసుకున్న కథను తన దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమానే ఈ ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’. తెలుగువారికి సుపరిచితురాలైన నటి ఖుష్బూ సుందర్‌ ఈ సినిమాని నిర్మించారు. సినిమా పేరు ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’ లానే ఈ సినిమాలోని వినోదం డబుల్‌ డోస్‌ గ్యారెంటీ. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం. 

ఈ సినిమా కథ రజనీది. పుట్టుక లోపం వల్ల ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రజనీ ఆడపిల్లగా ఉంటుంది. ఆపై అబ్బాయిగా మారిపోతుంది. రజనీ కన్నతల్లిదండ్రులకు ఈ విషయం రజనీ పుట్టుకతోనే తెలిసి చాలా జాగ్రత్తగా పెంచుతారు. పగలు ఉన్న రజనీకి రాత్రి ఉన్న రజనీకి శరీరం ఒకటే అయినా ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం ఇద్దరికీ తెలియదు. వారిద్దరినీ కలిపేది ఇద్దరూ కలిసి వాడే మొబైల్‌ ఫోన్‌ మాత్రమే. ఇదే సమయంలో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో రజనీ తల్లిదండ్రులు పగలు చనిపోతారు. 

అదే రోజు రాత్రి మారిపోయిన రజనీ ఈ విషయం తెలుసుకుని తనకి ఆఖరి చూపు కూడా దక్కనీయలేదని పగటి రజనీ పై ద్వేషం పెంచుకుంటాడు. ఇక ఆ పై కథ చాలా మలుపులు తిరుగుతూ ప్రేక్షకుల ఊహకందని విధంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో పగటి రజనీని కొందరు దుండగులు కొన్ని కారణాల వల్ల కిడ్నాప్‌ చేస్తారు. కానీ అనుకున్నట్టుగా రాత్రి రజనీగా మారడు. ఆ పై ఏం జరుగుతుంది? అనేది మాత్రం ‘డబుల్‌ ఆక్యుపెన్సీ’ సినిమాలోనే చూడాలి. 

ఇటువంటి కథాంశం అడపా దడపా మనం చూస్తున్నప్పటికీ దర్శకుడు ఈ సినిమాని మలిచిన తీరు మాత్రం అద్భుతం. ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. సో... మస్ట్‌ వాచ్‌ దిస్‌ డబుల్‌ డోస్‌ కామెడీ ఫర్‌ ది వీకెండ్‌.      
– హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement