శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ | Dhoomakethu Movie Review Telugu And OTT Details | Sakshi
Sakshi News home page

Dhoomakethu Review Telugu: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు రివ్యూ

Oct 23 2026 4:37 PM | Updated on Oct 23 2026 4:43 PM

Dhoomakethu Movie Review Telugu And OTT Details

థ్రిల్లర్ అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రతినెలా కనీసం ఒకటి రెండు చిత్రాలు ఇలాంటివి రిలీజ్ చేస్తుంటారు. అలా గత నెలలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న టైమ్ లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు'. ఇప్పుడిది నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఇదెలా ఉంది? చూడొచ్చా లేదా?

కథేంటి?
36 ఏళ్ల లతిన్ కుమార్ అలియాస్ కుట్టన్ (సజిన్ గోపు)కి షర్మిల (నిఖిలా విమల్) అనే అందమైన అమ్మాయితో పెళ్లి సెట్ అవుతుంది. 'కాకి ముక్కుకి దొండపండు' అని ఊరంతా ఈ జంట గురించి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఈ పెళ్లి బాగానే జరిగిపోతుంది కానీ అదేరోజు రాత్రి శోభనంకి మాత్రం అడ్డంకులు ఎదురవుతాయి. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి కుట్టన్‌ని చంపేస్తారు. అసలు వీళ్లెవరు? కుట్టన్‌నే ఎందుకు టార్గెట్ చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇదో టైమ్ లూప్ థ్రిల్లర్ సినిమా. అంటే ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల కారణంగా ఒకేరోజులో చిక్కుకుపోతాడు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు ఇతడికే ఎందుకు ఇలా జరుగుతోంది? చివరకు ఏమైందనేదే సింపుల్‌గా స్టోరీ. ఈ లైన్ చెప్పగానే ఎడ్జ్ ఆఫ్ టొమారో, సోర్స్ కోడ్, ట్రయాంగిల్, ప్రీ డెస్టినేషన్ లాంటి ఇంగ్లీష్ సినిమాలతో పాటు కొన్నాళ్ల క్రితం తమిళంలో వచ్చిన 'మానాడు' కచ్చితంగా గుర్తొస్తాయి.

కథ పరంగా ఇప్పటికే ఇలాంటివి చాలా చూసేశాం. కాబట్టి సినిమాని ఎలా తీశారు అని చూస్తే.. మరీ సూపర్ కాకపోయినప్పటికీ బాగానే తీశారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ వ్యక్తి శోభనానికి, టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌ని జోడించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఫస్టాప్ అంతా కూడా కుట్టన్‌కి అసలెందుకిలా జరుగుతోంది అనే సందేహం మనకు తలెత్తుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి చిన్నపాటి ట్విస్ట్ వస్తుంది.

ఈ సస్పెన్స్‌కి ఎలాంటి బ్యాక్ స్టోరీ ఉంటుందా అని అనుకుంటే.. రొటీన్ రెగ్యులర్ స్టైల్ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. దీంతో అప్పటివరకు ఉన్న ఆసక్తి కాస్త సన్నగిల్లింది. అలా అని మరీ బాలేదా అంటే పర్లేదు ఓసారి చూడొచ్చంతే. చాలా మలయాళ సినిమాల్లా ఇందులోనూ కాస్త సాగదీత ఉంది. కాకపోతే అనవసర సీన్స్ పెద్దగా లేకపోవడంతో టైమ్ పాస్ అయిపోతుంది.

అయితే సినిమాలో కీలకమైన 'టైమ్ లూప్' కాన్సెప్ట్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీ లాంటివి చెప్పరు. అది అలా జరిగింది కాబట్టి హీరోకి అలా జరిగిందేమో అని మనమో అనుకోవాలంతే. ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండానే సినిమాని ముగించారు. అప్పటివరకు సౌమ్యుడిగా కనిపించిన హీరో.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి టాలీవుడ్ కమర్షియల్ హీరోల ప్రవర్తించడం కూడా స్టోరీకి సెట్ కాలేదు.

నటీనటుల విషయానికొస్తే 'ఆవేశం'లో ఫహాద్ ఫాజిల్ ఫ్రెండ్ పాత్ర చేసిన సజిన్ గోపు ఇందులో కుట్టన్ అని లీడ్ రోల్ చేశాడు. షర్మిలగా హీరోయిన్ నిఖిలా విమన్ కనిపించింది. వీళ్లిద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు కూడా పర్లేదనిపించారు. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్లున్నాయి. ఏదైనా టైంపాస్ ‍అయ్యే థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ప్రభాస్ బర్త్ డే.. దర్శకుడి భార్యకు ముద్దుపెట్టిన ఫొటో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement