షాకింగ్‌.. 500లకు పైగా సినిమాల డేటా లీక్‌! | CBFC Data Leak Exposes Certification Records Of Over 500 Films | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. 500లకు పైగా సినిమాల డేటా లీక్‌!

Oct 25 2026 1:02 PM | Updated on Oct 25 2026 1:21 PM

CBFC Data Leak Exposes Certification Records Of Over 500 Films

ఒక సినిమా విడుదలకు ముందు సెన్సార్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఇందుకోసం చిత్ర నిర్మాతలు సమర్పించే కీలక పత్రాలే ఇప్పుడు బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC)కు సంబంధించిన భారీ డేటా లీక్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 500లకు పైగా సినిమాలకు సంబంధించిన ధ్రువీకరణ రికార్డులు బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.

(చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే.. ‘నో’చెప్పలేకపోయా: అనుపమ)

ఈ డేటా లీక్‌లో కేవలం సినిమా సర్టిఫికేషన్‌ వివరాలే కాకుండా.. థియేటర్లలో విడుదలకు అనుమతి పొందేందుకు నిర్మాతలు సమర్పించిన స్క్రిప్టులు, కట్‌ ఆర్డర్లు, ఇతర కీలక పత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. 

పోర్టల్‌ నుంచే లీక్‌?
సినిమాల ధ్రువీకరణ ప్రక్రియను డిజిటలైజ్‌ చేయడంలో భాగంగా సీబీఎఫ్‌సీ సుమారు పదేళ్ల క్రితం ఇ-సినీప్రమాణ్‌ (eCinepramaan) అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థలు సినిమా సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన పత్రాలను ఈ పోర్టల్‌లోనే అప్‌లోడ్‌ చేస్తారు. అయితే ఈ పోర్టల్‌కు సంబంధించిన రికార్డులే ఇప్పుడు బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ నుంచి అందుబాటులోకి..
ఆన్‌లైన్‌ సమాచారాన్ని భద్రపరిచే లాభాపేక్షలేని డిజిటల్‌ లైబ్రరీ అయిన ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ ద్వారా ఈ రికార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సంబంధిత మెటీరియల్‌ను తొలగించినట్లు ఇంటర్నెట్‌ ఆర్కైవ్‌ వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటనపై సైబర్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ఎలాంటి ఆధారాలు లభించలేదు: సీబీఎఫ్‌సీ
ఈ డేటా లీక్‌ వ్యవహారంపై సీబీఎఫ్‌సీ స్పందించింది. అనధికారిక యాక్సెస్‌కు సంబంధించిన ఆరోపణలపై సమీక్ష చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పోర్టల్‌ భద్రతను అంచనా వేసేందుకు సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహిస్తున్నామని తెలిపింది.అయితే బహిర్గతమైన పత్రాలను ఇతరులు యాక్సెస్‌ చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది. అలాగే ఏ ఒక్క చిత్ర నిర్మాత ఖాతా హ్యాక్‌ అయినట్లు కూడా కనిపించడం లేదని పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement