టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కృషి | Sakshi
Sakshi News home page

టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కృషి

Published Thu, Mar 30 2023 4:22 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షిషా - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: టీబీని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సరైన సమయంలో టీబీని గుర్తించడం ద్వారా క్షయ వ్యాధిని అరికట్టవచ్చని అన్నారు. ప్రభుత్వం టీబీకి సంబంధించి రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా ఉచితంగా జరిపి మందులు అందజేస్తుందని తెలిపారు. చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెలా రూ. 500ల పోషణ భత్యం అందిస్తుందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి టీబీ వచ్చే అవకాశముందని, తెమడ దగ్గుతో బాధపడుతూ టీబీ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. కోవిడ్‌ సమయంలో వైద్యుల సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌లను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ చందూ నాయక్‌ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, టీబీ సిబ్బంది సహకారంతో టీబీ నివారణలో జిల్లా రాష్టంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో వైద్య శాఖ ఉప సంచాలకులు వెంకటేశం, టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మాధురి, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం

ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశామని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని, అదనపు కలెక్టర్‌ రమేశ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో మొత్తం 10,700 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 69 పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌, జిరాక్స్‌ కేంద్రాల మూసివేత, పోలీస్‌ బందోబస్తు, ఆర్టీసీ బస్సులు నడిపేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్‌్స్‌లో డీఈఓ రాధాకిషన్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జానకిరాం, రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా ట్రెజరీ అధికారి సాయిలు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ రవిచందర్‌, డాక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటల వివరాలు అందించండి

జిల్లాలో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను త్వరితగతిన అందజేయాలని కలెక్టర్‌ రాజర్షిషా వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలోని ఉద్యాన, వ్యవసాయ అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్‌ రాజర్షిషా

Advertisement
Advertisement