ప్రాధాన్యత రంగానికి ఎక్కువ రుణాలివ్వాలి | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యత రంగానికి ఎక్కువ రుణాలివ్వాలి

Published Thu, Dec 21 2023 1:06 AM

2024–25 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న కలెక్టర్‌ రవినాయక్‌, ఇతర అధికారులు  - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ప్రాధాన్యత రంగాలకు ఎక్కువ రుణాలు అందించేలా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కలెక్టర్‌ జి.రవినాయక్‌ సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు వడ్డీ వ్యాపారులు, ఇతరుల దగ్గర రుణాలు తీసుకొని మోసపోకుండా బ్యాంకులు ఆర్థిక అవగాహన శిబిరాలను నిర్వహించాలని, అన్ని బ్యాంకుల బ్రాంచీలు జిల్లాలో గ్రామానికి ఒక శిబిరం చొప్పున నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్‌ ప్రాంతాలలో సైతం మెగా ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను నిర్వహించాలన్నారు.

● 2023–24 సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా గత సెప్టెంబర్‌ చివరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరారు. 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ పంట రుణాల కింద రూ.3162.45 కోట్ల రుణాల లక్ష్యానికి రూ.1453.82 కోట్ల రుణాలు ఇచ్చారని చెప్పారు. వ్యవసాయ కాలపరిమితి రుణాల కింద రూ.601.64 కోట్లలకు రూ.638.17 కోట్ల రుణాలు ఇచ్చి 106.7శాతం లక్ష్యాలను సాధించారని వివరించారు. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.4,333.58 కోట్ల రుణాలు ఇవ్వాలని గత వార్షిక రుణ ప్రణాళికలో లక్ష్యంగా నిర్ణయించగా, సెప్టెంబర్‌ వరకు రూ.2,224.86 కోట్లు ఇచ్చి 51.34 శాతం లక్ష్యాన్ని సాధించారని తెలిపారు.

● ప్రాధాన్యత రంగంలో రూ.5,143.27 కోట్లకు రూ.2,775.29 కోట్లు ఇచ్చారని, ప్రాధాన్యేతర రంగం కింద రూ.344 కోట్లకు రూ.928 కోట్లు ఇచ్చి.. 269శాతం సాధించామని తెలిపారు. 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో మొత్తం రూ.5488.25 కోట్లకు రూ.3,703.7కోట్ల రుణాలిచ్చి 67.48శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వివరించారు.

● స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కింద ఐదేళ్లలో ఇచ్చిన రుణాలు, పొందిన తర్వాత వారి జీవన విధానంలో వచ్చిన మార్పులపై డేటా సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్‌బీఐఆర్‌సెటీ ద్వారా ఈ సంవత్సరం 422 మందికి శిక్షణ ఇవ్వగా, 75 మంది బ్యాంకు అనుసంధానంతో రుణాలు తీసుకున్నారని అధికారులు చెప్పగా.. మిగిలిన వారు రుణాలు తీసుకోకపోవడానికి గల కారణాలను నివేదించాలని సూచించారు. మున్సిపాలిటీల పరిధిలో 15,905 మంది వీధి వ్యాపారులకు రుణాలివ్వాలని గుర్తించగా, 8వేల మందికి రుణాలు ఇచ్చారని, అలాగే రెండో విడతలో గుర్తించి 9,826లో కేవలం 1,028 మందికే రుణాలివ్వడానికి గల కారణాలు సమర్పించాలని సూచించారు. బ్యాంకుల ద్వారా వివిధ సెక్టార్ల కింద రుణాలు పొందిన వారు వాటిని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, నాబార్డ్‌ డీడీఎం షణ్ముఖశర్మ, ఆర్బీఐ ఎల్బీఓ దేవజిత్‌ బారువా, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కాల్వ భాస్కర్‌ పాల్గొన్నారు.

నాబార్డ్‌ ఆర్థిక అంచనా రూ.6,203.5 కోట్లు

2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్‌ ద్వారా పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ కింద రూ.6203.5 కోట్ల ఆర్థిక అంచనా కరదీపికను కలెక్టర్‌ రవినాయక్‌ విడుదల చేశారు. నాబార్డ్‌ జిల్లాలో అందుబాటులో ఉన్న భౌతిక, ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. దీన్ని ఆధారంగా చేసుకొని జిల్లాలో లీడ్‌ బ్యాంకు వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేయడానికి వార్షిక జిల్లా క్రెడిట్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తుందన్నారు. దీని ప్రకారంపంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌ కోసం రూ.3,343.41 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్‌ లోన్‌ రూ.1,001.26 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం రూ.86.87 కోట్లు, అనుబంధ కార్యకలాపాల కోసం రూ.497.85 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) కోసం రూ.1,129.95 కోట్లతో జిల్లాకు మొత్తం ప్రాధాన్యత రంగానికి రూ.6,203.50 కోట్లుగా నాబార్డు ఆర్థిక అంచనా వేసినట్లు తెలిపారు.

బ్యాంకులు ఆర్థిక అవగాహన శిబిరాలు నిర్వహించాలి: కలెక్టర్‌

Advertisement
Advertisement