Sakshi News home page

9న పలు ఆర్జిత సేవలు రద్దు

Published Thu, Mar 28 2024 1:35 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 9వ తేదీన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించనున్న నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దుచేశామని ఆలయ వైదిక కమిటీ బుధవారం తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున అమ్మవారి ఆలయం చుట్టూ జరిగే ప్రదక్షిణలను నిలిపివేయనున్నారు. సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, పల్లకీ సేవలను నిలుపుదల చేస్తారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, చండీ హోమం సేవలు అర్ధగంట ఆలస్యంగా జరుగుతాయి.

కొండాలమ్మ ఆదాయం రూ.30.53 లక్షలు

గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలోని హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధి కారి కానూరి సురేష్‌బాబు తెలిపారు. దేవదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు, గుడ్లవల్లేరు పోలీస్‌ అధికారులు, భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు. 64 రోజులకు రూ.30,53,464 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి

విజయవాడస్పోర్ట్స్‌: ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లోని చెక్‌ పోస్ట్‌ల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా ఆదేశించారు. గుణదల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రామచంద్రపాలెం చెక్‌ పోస్ట్‌లతో పాటు పాతపాడు, పాములకాలువ ప్రాంతాలను మునిసిపల్‌ కమిషనర్‌ స్విప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. సీపీ రాణా మాట్లాడుతూ.. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. జిల్లాలోకి అక్రమ మార్గంలో ప్రవేశించే నగదు, మద్యం, సారా, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను గుర్తించి అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. వాంబేకాలనీలో పారా మిలటరీ బలగాలకు ఏర్పాటు చేసిన వసతిని సందర్శించారు.

నైపుణ్యతే ఉపాధికి గీటురాయి

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, విద్యార్హతతో పాటు నైపుణ్యం కలిగిన వారిని వరిస్తాయని జేఎన్‌టీయూకే మాజీ ఉపకులపతి, జాతీయ సాంకేతిక శిక్షణ, పరిశోధక సంస్థ చైర్మన్‌ ఆచార్య వి.ఎస్‌.ఎస్‌.కుమార్‌ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజి నీరింగ్‌ కళాశాలలో బుధవారం జరిగిన అతిథి ఉపన్యాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక రంగంలో రోజురోజుకూ మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే నైపుణ్యత అవసరమని సూచించారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన ఎంతో మంది విద్యార్థులు విదేశాలలో మంచి అవకాశాలు పొందుతున్నారని పేర్కొన్నారు, ఆ దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కె.శోభన్‌బాబు, ప్రవాసాంధ్రుడు అంకయ్య చౌదరి, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రధాన ఆచార్యుడు ఆచార్య సుందర కృష్ణ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement