పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ

Published Sat, May 4 2024 12:50 AM

పోలిం

ముదిగొండ/బోనకల్‌: ముదిగొండ మండలంలోని న్యూలక్ష్మీపురం, కమలాపురం, బాణా పురం, వల్లబి, గంధసిరి, వల్లాపురం గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు డాక్టర్‌ సంజయ్‌ జి.కోల్టే శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో వసతులపై ఆరా తీసిన ఆయన తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. ఆతర్వాత వల్లబిలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీ రికార్డులను పరిశీలించారు. అలాగే, బోనకల్‌ మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సైతం సంజయ్‌ తనిఖీ చేసి ఉద్యోగులకు సూచనలు చేశారు. తహసీల్థార్లు రామారావు, పున్నంచందర్‌, ఎంపీడీఓ ఎల్‌.రాజు, ఎంపీఓలు సూర్యనారాయణ, శాస్త్రి, ఉద్యోగులు ఉషారాణి, సాంబశివరావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

‘నీట్‌’ రాయనున్న

డీఎంఏ అధ్యాపకులు

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని డాక్టర్స్‌ మెడికల్‌ అకాడమీ(డీఎంఏ)కి చెందిన నలుగురు అధ్యాపకులు నీట్‌ రాయనున్నారని అకాడమీ బాధ్యులు తెలిపారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలనీ, బాటనీ అధ్యాపకులు రాయల సతీష్‌బాబు, ఈగా భరణికుమార్‌, అన్వేష్‌, ఉదయ్‌కుమార్‌ శుక్రవారం మాట్లాడుతూ ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థులు అవగాహన లేక లక్ష్యాన్ని చేరలేకపోతున్నారని తెలిపారు. ఈమేరకు తాము పరీక్ష రాసి స్వీయ అనుభవంతో విద్యార్థులకు బోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

426 మంది

విద్యుత్‌ సిబ్బందికి శిక్షణ

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ సిబ్బందికి నైపుణ్యాల పెంపు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఇస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. జిల్లాలోని వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్న 426 మంది ఉద్యోగులకు గతనెల 19నుంచి విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్‌ పర్యవేక్షణలో వరంగల్‌ ఎన్పీడీసీఎల్‌కు చెందిన నిపుణులు తరగతులు నిర్వహించగా.. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముగింపు సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాటిస్తూ జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.

బోదులబండలో

అగ్నిప్రమాదం

నేలకొండపల్లి: మండలంలోని బోదులబండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో రైతు వేముల బాబుకు చెందిన వరి గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో దాదాపు 150 వరిగడ్డి దిండ్లు కాలిపోతుండగా, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. అయినా సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని స్థానికుల సమన్వయంతో మంటలను అదుపు చేశారు. ఇళ్ల మధ్య మంటలు చెలరేగగా సమయానికి ఆర్పడంతో ప్రమాదం తప్పినట్లయింది.

టన్ను చేపలు మృత్యువాత

నేలకొండపల్లి: మండలంలోని బైరవునిపల్లి చెరువులో దాదాపు టన్ను మేర చేపలు మృతి చెందాయి. చెరువులో నీరు అడుగంటడంతో సరిపడా ఆక్సిజన్‌ అందక చేపలు చనిపోతున్నాయి. గ్రామంలోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సభ్యుల నడుమ వివాదంతో చేపల వేట ఆలస్యమైంది. మరోపక్క ఎండ పెరిగి నీరు తగ్గుతుండడంతో చెరువులో చేపలు చనిపోయి తేలుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు టన్ను వరకు చేపలు చనిపోవడంతో రూ.లక్ష మేర నష్టం ఎదురైందని సొసైటీ అధ్యక్షుడు మల్లెబోయిన సైదులు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
1/3

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
2/3

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
3/3

పోలింగ్‌ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ

Advertisement
 
Advertisement