రైలింజిన్‌పై కూలిన కొమ్మ ●
● లోకోపైలట్‌కు గాయాలు
మండ్య: బెంగళూరు నగరం నుంచి మైసూరుకు వెళ్తున్న రైలు ఇంజిన్ ముందుభాగంపై గాలీవానకు చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో అద్దాలు పగిలిపోయి రైలు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మండ్య నగరంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సాయంత్రం 6:20 గంటలకు రైలు మండ్య స్టేషన్‌కు చేరుకున్న సమయంలో భారీ ఈదురు గాలులతో పాటు వర్షం కురిసింది. ఈ సమయంలో చెట్టు కొమ్మ పడిపోవడంతో లోకోపైలట్ ప్రసాద్ (39)కు గాయాలు తగిలాయి. ఆయనను మండ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స వేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. రైల్వే అధికారులు మరో లోకో పైలట్‌ను రప్పించి రైలును మైసూరుకు పంపించారు. దీని వల్ల మూడు గంటల పాటు ఆలస్యమైంది. ఆ రైలులోని అనేక మంది ప్రయాణికులు ఇతర రైళ్లలో వెళ్లిపోయారు.
జైలు నుంచి రేవణ్ణ విడుదల
బనశంకరి: మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ బెయిల్ పై మంగళవారం పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. మహిళపై వేధింపులు, కిడ్నాప్ కేసులో 11 రోజుల పాటు జైలు జీవితం గడిపిన రేవణ్ణ విడుదల కాగానే తండ్రి దేవెగౌడ కుటుంబంలో సంతోషం నెలకొంది. రేవణ్ణ పద్మనాభనగరలోని తండ్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇంటి బయట ఉన్న జేడీఎస్ కార్యకర్తలను చూసి కన్నీరుపెట్టారు. మీరు ఏడవకండి అని కార్యకర్తలు ఆయనను సముదాయిస్తూ, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత అక్కడి నుంచి జేపీ నగరలోని తిరుమలగిరి లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. తరువాత మైసూరు, శృంగేరి తీర్థయాత్రలకు వెళ్లారు.
వర్షానికి అరటితోట ధ్వంసం
తుమకూరు: సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి హులియూరు వద్దనున్న యళనాడు గ్రామంలో ఓ తోటలో 400కు పైగా అరటి చెట్లు నేలకూలాయి. వైఎస్ నాగరాజు అనె రైతు 1.3 ఎకరాలలో అరటి తోట వేశాడు. ఈదురుగాలులకు చెట్లు మొత్తం విరిగిపడ్డాయి. గాలీవానకు తిపటూరులో ప్రభుత్వ కాలేజీలో పెద్ద వృక్షం కాంపౌండ్ మీద కూలింది.
బ్యాటరీ బస్సు డ్రైవర్ల ధర్నా
శివాజీనగర: వేతనాలు చెల్లించలేదంటూ బీఎంటీసీ ఎలెక్ట్రిక్ బస్సు డ్రైవర్లు హఠాత్తుగా ధర్నాకు దిగారు. శాంతినగర డిపో–3 ముందు బస్సులను బయటికి తీయకుండా ధర్నా చేపట్టారు. సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని ధర్నా నిర్వహించిన ఉద్యోగులు మంగళవారం ఉదయం నుండి వాహనాలను బయటికి తీయలేదు. చివరకు బీఎంటీసీ అధికారులతో చర్చలు విజయవంతం కావడంతో బస్సులు బయటకు కదిలాయి. త్వరలోనే జీతాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
అప్పుల బాధతో
మహిళ ఆత్మహత్య
శివమొగ్గ: అప్పు చెల్లించాలని రుణదాతలు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆవేదన చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శివమొగ్గ తాలూకాలోని గొంది బట్నహళ్ళి గ్రామంలో జరిగింది. మృతురాలు శోభ (39). వివరాలు.. శోభ, రంగనాథ్ దంపతులు కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇందుకోసం బ్యాంకులోను, అధిక వడ్డీలకు మరికొందరి వద్ద అప్పులు చేశారు. రంగనాథ్‌కు పానీ పూరి షాపు సరిగా సాగక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో అసలు, వడ్డీ కట్టలేకపోయారు. కొన్నిరోజులుగా అప్పులవారు వచ్చి భర్తను, శోభను దూషించడంతో విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. శివమొగ్గ గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment