తెలంగాణలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం | Sakshi
Sakshi News home page

తెలంగాణలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం

Published Tue, Apr 23 2024 8:15 AM

సంగారెడ్డిలో మాట్లాడుతున్న పీయూష్‌ గోయల్‌, వేదికపై ఎంపీలు లక్ష్మణ్‌, బీబీ పాటిల్‌ - Sakshi

సంగారెడ్డి: మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని జోస్యం చెప్పారు. దేశంలో ఎన్డీయే కూటమి 400లకుపైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్తగా ఎర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరన్నారు. ఈ ఎన్నికలతో ఆ పార్టీ శకం ముగుస్తుందన్నారు. మోదీ దేశ ప్రజలకు గ్యారంటీ కార్డు అన్నారు. ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిన బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గణేష్‌ దేవాలయంలో పూజలు నిర్వహించిన బీబీ పాటిల్‌.. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు అరుణతార, గోదావరి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

దేశంలో ఎన్డీయేకు

400లకుపైగా సీట్లు ఖాయం

వికసిత్‌ భారతే లక్ష్యంగా పని చేస్తున్నాం

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో

గెలిపించాలని పిలుపు

తొమ్మిది నామినేషన్లు దాఖలు..

కామారెడ్డి క్రైం: జహీరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాలుగో రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఆయన వెంట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ తరఫున పార్టీ నాయకులు ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. టీపీఎస్‌ అభ్యర్థిగా కొత్త బలిజ బస్వరాజ్‌ రెండు సెట్లు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి మాలెపు మోహన్‌రెడ్డి ఒక సెట్‌, స్వతంత్ర అభ్యర్థిగా రవి మహాదేవ్‌ స్వామి రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా గంగారాం, రమేశ్‌లు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌లు దాఖలు చేశారు.

నామినేషన్‌ వేస్తున్న బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌
1/1

నామినేషన్‌ వేస్తున్న బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌

Advertisement
Advertisement