సీతాకల్యాణం.. ఊరూరా మహోత్సవం | Sakshi
Sakshi News home page

సీతాకల్యాణం.. ఊరూరా మహోత్సవం

Published Thu, Apr 18 2024 10:25 AM

పి.గన్నవరంలో సీతమ్మకు సమర్పించిన కంత (సారె)  - Sakshi

పెదపూడి: శ్రీరామ నవమి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. వివిధ దేవాలయాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణ తంతను వీక్షించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీకోదండ సీతారాముని కల్యాణం రమణీయంగా జరిగింది. తెల్లవారుజాము నుంచీ భక్తులు ఆలయ సమీపంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉద యం ఆరు నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉద యం 11.20 గంటలకు స్వామివారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అమ్మిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు స్వామివారికి మంచి ముత్యాలు తలంబ్రాలుగా సమర్పించారు. 11.35 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట జరిగింది. భక్తులకు ఆలయ అధికారులు ముత్యాల తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు.

కనువిందు చేసిన కోవా సారె

పి.గన్నవరం: స్థానిక పట్టాభి రామాలయం వద్ద సీతారామస్వామివారి కల్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్చకస్వామి వాడపల్లి రాంబాబు నేతృత్వంలో కల్యాణం నిర్వహించారు. సత్యవాణి దంపతులు కోవాతో తయారు చేయించిన 108 రకాల స్వీట్లు, పిండి వంటలను శ్రీరాముని తరఫున సీతమ్మకు సారె (కంత)గా సమర్పించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం

ఆత్రేయపురం: పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 8.45 గంటలకు వేద మంత్రోచ్ఛారణ నడుమ రమణీయంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితుడు, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన శ్రీనివాసులు వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో జరిగిన కల్యాణ వేడుకలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి కల్యాణ మంటపం వరకూ తోడ్కొని వచ్చారు. ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. సంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలను సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను ఉదయం గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో బి.కృష్ణ చైతన్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

రామాలయాల్లో ప్రత్యేక పూజలు

కల్యాణ ఘట్టంలో మంగళసూత్రం చూపిస్తున్న పండితుడు
1/3

కల్యాణ ఘట్టంలో మంగళసూత్రం చూపిస్తున్న పండితుడు

2/3

జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు
3/3

జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

Advertisement

తప్పక చదవండి

Advertisement