కన్నుల పండువగా సత్యదేవుని జ్వాలాతోరణం | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా సత్యదేవుని జ్వాలాతోరణం

Published Sun, Nov 26 2023 11:36 PM

తోరణానికి జ్వాల వెలిగిస్తున్న 
ఈఓ రామచంద్ర మోహన్‌  - Sakshi

అన్నవరం: కార్తిక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని జ్వాలాతోరణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. నిండు పున్నమి రేయిలో.. చంద్రుని కిరణాలతో తెల్లని కాంతులు ఆవరించిన వేళ.. జ్వాలాతోరణం నుంచి ఎరుపు రంగులో ఎగసిపడిన జ్వాలలు సూర్యుని వెలుగులా ప్రకాశించాయి. సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని పల్లకీపై ఊరేగింపుగా మెట్ల మార్గంలో తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర పూజల అనంతరం రాత్రి ఏడు గంటలకు జ్వాలాతోరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రించిన గడ్డితో రూపొందించిన తోరణాన్ని తొలి పావంచాకు ఎదురుగా జాతీయ రహదారిపై కట్టారు. సత్యదేవుడు, అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం, పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆ తోరణానికి దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్‌ జ్వాల అంటించారు. అది మండుతూంతుండగా దాని కింద నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకీలో ఉంచి మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. కార్యక్రమం అనంతరం మిగిలిన గడ్డిని భక్తులు ప్రసాదంగా తీసుకున్నారు. ఈ గడ్డిని పశువులకు పెట్టినా, వ్యవసాయ క్షేత్రంలో ఉంచినా మంచి జరుగుతుందని పండితులు తెలిపారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయశర్మ, సుధీర్‌, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జ్వాలాతోరణం దిగువ నుంచి పల్లకీతో సత్య 
దేవుడు, అమ్మవారిని ప్రదక్షిణ చేయిస్తున్న దృశ్యం
1/1

జ్వాలాతోరణం దిగువ నుంచి పల్లకీతో సత్య దేవుడు, అమ్మవారిని ప్రదక్షిణ చేయిస్తున్న దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement