జాతీయ స్థాయి పోటీలకు తనూజ ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు తనూజ ఎంపిక

Published Tue, Nov 21 2023 11:32 PM

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న 
తనూజను అభినందిస్తున్న నరసింహారావు - Sakshi

తుని: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు శ్రీప్రకాష్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన కర్రి తనూజ ఎంపికై నట్టు విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు మంగళవారం తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16నుంచి 18 వరకు కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌–19 బాలికల హ్యాండ్‌ బాల్‌ పోటీలో తనూజ ఉత్తమ ప్రతిభ చూపిందన్నారు. జాతీయ స్థాయికి అర్హత సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున వచ్చె నెల హర్యానాలోని సిర్సాలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. హ్యాండ్‌ బాల్‌ కోచ్‌ సురేష్‌ ఇచ్చిన శిక్షణతో ఈ అవకాశం లభించిందన్నారు. తనూజను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.

25న అరుణాచలం

గిరి ప్రదక్షిణ యాత్ర బస్సు

అమలాపురం రూరల్‌: అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు ఈ నెల 25న ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశామని ఏపీఎస్‌ ఆర్టీసీ అమలాపురం డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో భాగంగా కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి, విజయవాడ ప్రాంతాల్లోని దేవాలయాలను దర్శించుకోవచ్చని వివరించారు. అనంతరం ఆదివారం పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత బుధవారం అమలాపురం చేరుతారని తెలిపారు. పుష్‌ బ్యాక్‌ 2 2 సిట్టింగ్‌ సౌకర్యంతో సూపర్‌ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌)ను 70138 68687, రిజర్వేషన్‌ కౌంటర్‌ను 99592 25576, బస్‌ స్టేషన్‌ను 99592 25550 సెల్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ సర్వీసును 99500 నంబరుతో నడుపుతామని, ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉందని సత్యనారాయణమూర్తి తెలిపారు.

సుుబ్రతో ముఖర్జీ ఫుట్‌బాల్‌

పోటీలకు ఎంట్రీల ఆహ్వానం

అమలాపురం రూరల్‌: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ అండర్‌–15 అంతర్‌ పాఠశాలల అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఆసక్తి ఉన్న బాలబాలికల జట్లు ఎంట్రీలు పంపించాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు సురేష్‌కుమార్‌ తెలిపారు. వచ్చే నెల ఏడో తేదీలోగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థకు ఎంట్రీలు పంపించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామోపాధ్యాయులు, ఫుట్‌బాల్‌ శిక్షకులు, క్రీడాకారులు ఈ విషయం గమనించాలని సూచించారు.

బాలబాలాజీ స్వామికి

రేపు లక్ష తులసి పూజ

మామిడికుదురు: శ్రీదేవి, భూదేవి సమేతంగా అప్పనపల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీ బాలబాలాజీ స్వామి వారికి కార్తిక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం వార్షిక లక్ష తులసి పూజ నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ఈఓ జి.మాధవి మంగళవారం ఈ విషయం తెలిపారు. ఉదయం 9.30 గంటలకు సంకల్పంతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. లక్ష తులసి పూజకు భక్తులు హాజరు కావాలని కోరారు.

విజ్ఞానం, క్రీడల్లో

విద్యార్థులు రాణించాలి

అమలాపురం టౌన్‌: విజ్ఞానంతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. స్థానిక వడ్డిగూడెంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల హాస్టల్‌ విద్యార్థులకు ఆయన మంగళవారం టీవీ, స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. అనంతరం టీవీని ప్రారంభించారు. వారితో మమేకమై పాఠ్యాంశాలు, జనరల్‌ నాలెడ్జిపై పలు ప్రశ్నలు వేసి, వారిచ్చిన సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జనరల్‌ నాలెడ్జిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలని సూచించారు. అనంతరం వారితో చెస్‌, కేరమ్స్‌ ఆడి ఉత్సాహపరిచారు. అందరూ చదువులో మంచి ర్యాంకులు సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement