Sakshi News home page

విద్యార్థులు విజ్ఙానాన్ని పెంపొందించుకోవాలి

Published Fri, Nov 17 2023 1:26 AM

- - Sakshi

భూపాలపల్లి రూరల్‌: విద్యార్థులు విజ్ఙానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి బర్ల స్వామి అన్నారు. గురువారం భూపాలపల్లి ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 31వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్‌ అధికారి స్వామి తెలిపారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్‌ కుమార్‌, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బండిలత, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతులు

మద్దతు ధర పొందాలి

కాటారం: పత్తి సాగుచేసిన రైతులు సీసీఐ కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. కాటారం మండలం చల్లపల్లి రుద్రా జిన్నింగ్‌ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి సీసీఐ ద్వారా మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి కనకశేఖర్‌, సీసీఐ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ అభయ్‌ ప్రతాప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబులెన్స్‌లో

గర్భిణి ప్రసవం

ఏటూరునాగారం: మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన గర్భిణిని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన కేసరి సారమ్మకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌లో వాజేడు పీహెచ్‌సీకి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి రెఫర్‌ చేయగా తరలించారు. అక్కడి ప్రసూతి వైద్య నిపుణులు పరీక్షించిన వైద్యులు గర్భిణికి డయాబెటిస్‌ ఉండడంతో పాటు ఉమ్మనీరు పోయినందున మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. అంబులెన్స్‌లో తరలిసున్న క్రమంలో 108వాహనం జవహర్‌నగర్‌ గ్రామ సమీపానికి చేరుకోగానే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ శివలింగం ప్రసాద్‌, ఈఆర్సీపీ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ సూచనలతో సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

ములుగు: రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ మాటలను నమ్మి మోసపోవద్దని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఈ మేరకు టీఎస్‌డీఎఫ్‌ తరఫున జాగో(మేలుకో) తెలంగాణ, ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల చైతన్య యాత్ర గురువారం జిల్లా కేంద్రానికి చేరుకోగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనకు మేడిగడ్డ బ్యారేజ్‌ నిలువుటద్దం అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దోపిడీ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు సేవ చేస్తుందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీని పక్కాగా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి, అబద్దపు, అసత్య, నిరంకుశ, అహంకార పాలన కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టడానికి గత నెల 27వ తేదీ నుంచి యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement