జెలెన్‌స్కీకి ప్రత్యామ్నాయం.. ఉక్రెయిన్‌లో అధ్యక్ష రేసులో ఆరుగురు | Who could replace Zelenskyy | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీకి ప్రత్యామ్నాయం.. ఉక్రెయిన్‌లో అధ్యక్ష రేసులో ఆరుగురు

Oct 12 2026 7:36 PM | Updated on Oct 12 2026 7:49 PM

 Who could replace Zelenskyy

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్థానంలో కొత్త నాయకుడు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఎవరెవరు పోటీ పడవచ్చనే చర్చ మొదలైంది. మాజీ సైనికాధికారి, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉక్రెయిన్‌ రాయబారిగా ఉన్న వలెరీ జలుజ్నీ ఈ జాబితాలో ముందున్నారు. సైనిక గూఢచర్య విభాగం మాజీ అధిపతి కిరిలో బుడనోవ్‌, రక్షణ మంత్రి మైఖైలో ఫెడొరోవ్‌ కూడా కీలక ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు.

జెలెన్‌స్కీ ఐదేళ్ల అధ్యక్ష పదవీకాలం 2024లో ముగిసినప్పటికీ, రాజ్యాంగ నిబంధనలు, మార్షల్‌ లా కారణంగా ఆయన యుద్ధకాలంలో పదవిలో కొనసాగుతున్నారు. రష్యాతో నాలుగున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడంపై ఉక్రెయిన్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 60 రోజుల కాల్పుల విరమణకు హామీ ఇస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.

జలుజ్నీకి ప్రజల్లో ఆదరణ
కీవ్‌కు చెందిన రేటింగ్‌ గ్రూప్‌ అక్టోబర్‌ 8న విడుదల చేసిన సర్వే ప్రకారం.. జలుజ్నీపై 64 శాతం మంది ఉక్రెయిన్‌ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. 25 శాతం మంది ఆయనపై అవిశ్వాసం ప్రకటించారు. 2022లో రష్యా దాడుల సమయంలో కీవ్‌ రక్షణలో, అనంతరం ఎదురుదాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. రష్యా అధీనంలో ఉన్న భూభాగంలో 40 శాతాన్ని ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఆయన నాయకత్వం వహించారు. అయితే, 2023లో ఎదురుదాడి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయనను సైనికాధిపతి పదవి నుంచి తొలగించారు.

బుడనోవ్‌, ఫెడొరోవ్‌ కూడా పోటీలో
బుడనోవ్‌(40)పై 53 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, 31 శాతం మంది అవిశ్వాసం ప్రకటించారు. గతంలో సైనిక గూఢచర్య విభాగానికి నాయకత్వం వహించిన ఆయన.. రష్యాపై పలు సాహసోపేత కార్యకలాపాలకు నేతృత్వం వహించారు. ఫెడొరోవ్‌ (35) మంత్రిగా పనిచేసి, ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందించే వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. రక్షణ మంత్రిగా ఆయుధాల కొనుగోళ్లలో పారదర్శకత, డ్రోన్ల వినియోగం పెంపుపై దృష్టి పెట్టారు. ఆయనపై ప్రజల ఆమోదం జూన్‌లో 35 శాతం నుంచి జులైలో 65 శాతానికి పెరిగింది. అయితే, ఎన్నికలు నిర్వహించాలన్న ఆయన వ్యాఖ్యల తర్వాత ఆమోదం 38 శాతానికి తగ్గింది.

ఇతర నేతల పరిస్థితి ఏమిటి?
ఫెడొరోవ్‌ స్థానంలో జులైలో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యెవెనీ ఖ్మారాపై 29 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. 16 శాతం మంది అవిశ్వాసం ప్రకటించగా, 43 శాతం మందికి ఆయన ఎవరో తెలియదని సర్వే తెలిపింది. విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా, మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోపై విశ్వాసం వ్యక్తం చేసినవారు 24 శాతం చొప్పున ఉన్నారు.

అయితే, పోరోషెంకోపై 70 శాతం మంది అవిశ్వాసం ప్రకటించారు. జెలెన్‌స్కీపై 53 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, 40 శాతం మంది అవిశ్వాసం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 73 శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్‌తో విభేదాలు, యుద్ధ నిర్వహణ, అవినీతి ఆరోపణలు, ప్రజాభిప్రాయం రానున్న ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశముంది. అయితే, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది కాల్పుల విరమణ, యుద్ధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement