జిన్‌పింగ్‌ కూతురి ఫొటో, అడ్రస్‌ లీక్‌.. చుక్కలు చూస్తున్నాడు!

China Prez Jinping Daughter Photo Issue Jailed Man Mother Alleges - Sakshi

ఆయన ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన నేత. అమెరికా అంటే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటాడు. అలాంటోడు తన గారాల కూతురిని మాత్రం సురక్షితంగా శత్రుదేశంలోనే దాచిపెట్టాడు.. అక్కడే చదివించాడు కూడా. అదీ బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. ఆ కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా?..

2019లో చైనాకు చెందిన నియూ టెంగ్యూ అనే వ్యక్తి.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. ఇంకేం అధ్యక్షుల వారికి మండిపోయింది. ఆ దెబ్బకు  22 ఏళ్ల ఆ యువకుడిని అరెస్ట్‌ చేసి.. కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అక్కడి చట్టాలేమో అతగాడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతగాడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. 

ఏకంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అధ్యక్షుడి కూతురి ఫొటో, ఐడెంటిటీ బయటపెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక నియూకి, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అంతేకాదు.. అతని తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదని, ఇప్పటిదాకా 14 మంది లాయర్లను నియమించుకున్నామని ఆమె చెబుతోంది. 

అంతేకాదు.. కొడుకును కలిసేందుకు ఎన్ని అర్జీలు పెట్టుకుంటున్నా గువాంగ్‌డోంగ్‌ న్యాయస్థానం వాటిని తిరస్కరిస్తోందని, పైగా ఆ అర్జీలు తమదాకా రావడం లేదని చెబుతోందని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉంటే.. చైనాలో జీ జిన్‌పింగ్‌ ఫ్యామిలీని కదిలించినా.. ఆయన ప్రభుత్వంపై సెటైరిక్‌గా పోస్టులు చేసినా శిక్షలు కఠినంగానే ఉంటాయి.   


 
చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఏకైక త‌న‌య జీ మెంగ్జీ(30). తన రెండో భార్య పెంగ్‌ లియువాన్‌(ఫోక్‌ సింగర్‌)తో కలిగిన సంతానం‌. చైనా క‌మ్యూనిస్టు పార్టీ చ‌ట్టం ఆధారంగా అమెరికాలో కూతురు మెంగ్జీ ఉన్న‌త విద్య‌ను అభ్యసించింది. ఆపై ఐదేళ్లపాటు చైనాలో ఉండి.. మళ్లీ అమెరికాకే వచ్చి రీసెర్చి విద్యార్థిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ ప్రతినిధి(మాజీ) విక్కీ హార్ట్‌జ్లర్‌ ఆమధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఆ వెబ్‌సైట్‌, పత్రికల్లో ప్రచురితమైన ఐడెంటిటీ మెంగ్జీదేనా? అనేది మాత్రం ఇప్పటికీ అనుమానమే!. అలాగే ఆమెకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు.

ఇదీ చదవండి: గన్‌ గురిపెట్టి చంపబోయాడు, కానీ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top