అవసరమా! | Sakshi
Sakshi News home page

అవసరమా!

Published Thu, Feb 29 2024 7:48 PM

- - Sakshi

ఒక్కరు చేసే పనికి నలుగురైదుగురు ఎందుకు?
ఆదాయమేదీ..?

‘చెత్త’ పనులకు పెద్ద సంఖ్యలో డీసీలు, జేసీల వినియోగం

కార్పొరేటర్లు మండిపడ్డా.. ఖజానా దివాళా తీసినా తీరు మారని జీహెచ్‌ఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుంది జీహెచ్‌ఎంసీ తీరు. జీహెచ్‌ఎంసీలో పనులు లేక ఖాళీగా ఉంటున్న అధికారులతో ఖజానాకు భారమే తప్ప వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇటీవలి కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేట్లు ఆగ్రహం వ్యక్తం చేసినా..అధికారులను తగ్గించాల్సింది పోయి కొత్తగా వస్తున్నవారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సహా ఎందరో ఉన్నా జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని రప్పించలేక పోతున్నారని, అడ్డగోలు అక్రమాలతో ఖజానాకు చిల్లులు పడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిండుసభలో పార్టీలకతీతంగా సభ్యులు ముక్తకంఠంతో మండిపడ్డా తమదారి తమదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. కౌన్సిల్‌ సమావేశం జరిగిన తర్వాతే దాదాపు డజను మందికి పోస్టింగులిచ్చారు. అవైనా అధికారుల స్థాయికి తగ్గట్లు బాధ్యతలున్నాయా అంటే అదీలేదు. గతంలో ఒక్కరు చేసిన పనినే నలుగురైదుగురికి అప్పగించారు. అంటే అదనంగా పెరిగింది అధికారులే కాదు..వారికి అవసరమైన చాంబర్లు, కార్లు, సిబ్బంది వగైరా. దీంతో జీహెచ్‌ఎంసీకి ఖర్చుల భారం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. కేవలం తమ అవసరాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారికి పునరావాసకేంద్రంగా జీహెచ్‌ఎంసీ మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు.

ఒకే పనికి ఎందరెందరో..!

జీహెచ్‌ఎంసీలో గతంలో వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్యం, దోమల నివారణ, కుక్కల నియంత్రణ తదితరమైన వన్నీ ఒకే అడిషనల్‌ కమిషనర్‌ నిర్వహించేవారు. అదిసైతం ఐఏఎస్‌ అధికారి కాదు. సహాయకులుగా ఒక జాయింట్‌ కమిషనర్‌ ఉండేవారు. ప్రస్తుతం ఆరోగ్యానికి ఒక అడిషనల్‌ కమిషనర్‌, పారిశుధ్యానికి మరో అడిషనల్‌ కమిషనర్‌, ఇందులో ఒకరు ఐఏఎస్‌..అడిషనల్‌ కమిషనర్లకు సహాయకంగా నలుగురైదుగురు జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. వీరందరికీ కార్లతో సహా సకల సదుపాయాలకు జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీకి బదిలీపై వచ్చిన ఇద్దరు డిప్యూటీ కమిషనర్లకు రెండు జోన్లలోని పారిశుధ్య పనులు అప్పగించారు. జోన్ల స్థాయిలో కేవలం ఈ పనులకు ప్రత్యేంగా డిప్యూటీ కమిషనర్లను నియమించడం గతంలో లేదు. ఒక అడిషనల్‌ కమిషనర్‌కు గతంలో ఉన్న రెండు మూడు బాధ్యతలు తప్పించి కేవలం సంస్థాగత విచారణలు అనే విభాగాన్ని మిగిల్చారు. కొత్తగా బదిలీపై వచ్చిన మరో అడిషనల్‌ కమిషనర్‌కు పోస్టు కల్పించేందుకు ఉన్న బాధ్యతల్ని విడదీసి ఇలా అప్పగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో అడిషనల్‌ కమిషనర్‌కు లీగల్‌, విద్యుత్‌ విభాగం బాధ్యతలప్పగించారు. ఇంకో స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌కు ఎన్నికల విభాగం జాయింట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్‌కు సైతం ఎన్నికల విభాగంలోనే మరో జాయింట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇంకో స్పెషల్‌గ్రేడ్‌ కమిషనర్‌కు ఆరోగ్య విభాగంలో జాయింట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో విభాగంలో ఎంతమందిని నియమిస్తున్నారో అంతే లేదు.వీరి పోస్టింగుల వివరాలు వెలుగు చూసినప్పటికీ, ఇంకా వెలుగులోకి రాకుండా లోలోన ఎన్ని జరుగుతున్నాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సవాల్‌ విసురుతున్న కార్పొరేటర్లు

పనిలేని అధికారులు జీహెచ్‌ఎంసీకి తెల్ల ఏనుగుల్లా మారారని, పాలన చేతకాని వారు తమకు ఆయా విభాగాల బాధ్యతలప్పగిస్తే ఆదాయాన్ని పెంచి చూపిస్తామని కార్పొరేటర్లు సభ సాక్షిగా సవాల్‌ విసిరినా చలనం లేకపోవడం.. తగిన విధంగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆయా విభాగాల్లో అక్రమాల కట్టడికి హౌస్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.

ఎందరున్నా, జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయం రాకుండా గండ్లు పడుతున్నా అరికట్టలేకపోయారు. పోనీ ఆయా విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? అంటే అదీ లేదు. చెత్త పనుల కోసం ఎందరున్నా చెత్త సమస్యలు తగ్గడం లేదు. విద్యుత్‌ విభాగం నగరంలో చీకట్లను నివారించలేకపోతోంది. ప్రకటనల విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. రెవెన్యూ విభాగం ట్యాక్స్‌ వసూళ్లలో లోపాలు అరికట్టలేకపోయింది. అంతేకాదు.. ఏవిభాగంలో చూసినా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇటీవల అభయహస్తం దరఖాస్తులు గాల్లో కొట్టుకుపోవడం అందుకు ఒక నిదర్శనం. కార్పొరేటర్లు ఫోన్లు చేసినా అధికారులు స్పందించరు. మీడియా కోరినా వివరాలివ్వరు.

Advertisement
 
Advertisement
 
Advertisement