ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విధుల తనిఖీ | Sakshi
Sakshi News home page

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విధుల తనిఖీ

Published Thu, Nov 16 2023 1:24 AM

- - Sakshi

వరంగల్‌ అర్బన్‌: ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు రాజేశ్‌కుమార్‌ సూచించారు. బుధవారం ఆయన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని సీకేఎం ఆస్పత్రి, పోచమ్మ మైదాన్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రాజేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిబద్ధతతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల బందోబస్తు నిమిత్తం ఏనుమాముల మార్కెట్‌ యార్డులో ఉన్న కేంద్ర బలగాలను రాజేశ్‌కుమార్‌ కలిశారు. రక్షణ, విధులు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈతనిఖీల్లో వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి అజిత్‌రెడ్డి, లైజన్‌ ఆఫీసర్‌ ఆజాద్‌ పాల్గొన్నారు.

విధుల్లో అప్రమత్తంగా

ఉండండి: సీపీ

వరంగల్‌ క్రైం: ఎన్నికల వేళ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. బుధవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెట్రోకార్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. పెట్రోకార్‌ సిబ్బంది తమకు అప్పగించిన పరిధిలో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని, పెట్రోలింగ్‌ నిర్వహించే సమయంలో సిబ్బంది డేగ కన్నుతో పరిసరాల్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్‌, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, రమేశ్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి, సురేందర్‌, శ్రీధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

తగ్గిన నవజాత

శిశు మరణాలు

హన్మకొండ: నవజాత శిశువుల మరణాల రేటు 2000ల సంవత్సరంలో ప్రతీ వెయ్యి జననాలకు 44 ఉండగా.. 2020 నాటికి 20కి తగ్గిందని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యాకూబ్‌పాషా అన్నారు. నవజాత శిశువుల సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలు, గర్భిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ యాకూబ్‌పాషా మాట్లాడుతూ.. ప్రసవ సమయంలో లేదా పుట్టిన 24గంటల వ్యవధిలో 40శాతం మరణాలు సంభవిస్తాయన్నారు. శిశువు జన్మించినప్పటి నుంచి 42 రోజుల్లోపు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్ర వైద్యులు తేజస్విని, వి.అశోక్‌రెడ్డి, చంద్రశేఖర్‌, మాధవరెడ్డి, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్‌ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఫణికాంత్‌కు

ట్రావెల్‌గ్రాంట్‌ అవార్డు

కేయూ క్యాంపస్‌: కేయూలోని బయోటెక్నాలజీ విభాగం పరిశోధకుడు డాక్టర్‌ జోగం ఫణికాంత్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) సెర్ట్‌ ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ గ్రాంట్‌ అవార్డు లభించింది. ఈనెల 28 నుంచి డిసెంబర్‌ 2వరకు కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ ల్యాబోరేటరీ న్యూయార్క్‌ అమెరికాలో జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఈఅవార్డు లభించినట్లు ఫణికాంత్‌ తెలిపారు. ఈట్రావెల్‌ గ్రాంట్‌ అవార్డుతో అమెరికా ప్ర యాణ ఖర్చులు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, వీసా చార్జీ లు డీఎస్‌టీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సమకూర్చనుంది. ఫణికాంత్‌ను బుధవారం క్యాంపస్‌లో వీసీ అభినందించారు. కాగా.. డాక్టర్‌ ఫణికాంత్‌ సీఎస్‌ఐఆర్‌ పోస్టు డాక్టరల్‌ ఫెల్లోగా బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఏవీ రావు పర్యవేక్షణలో పని చేస్తున్నారు.

1/1

Advertisement
Advertisement