
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు.
ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు.
ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు.
(చదవండి: వేసవి అంటే సెలవులేనా?)