బైక్‌ రైడర్స్‌ బైక్స్‌ ఆన్‌.. | SHE POWER Foundation will organise a women's safety bike rally in Hyderabad | Sakshi
Sakshi News home page

బైక్‌ రైడర్స్‌ బైక్స్‌ ఆన్‌..

Oct 13 2026 4:25 AM | Updated on Oct 13 2026 4:25 AM

SHE POWER Foundation will organise a women's safety bike rally in Hyderabad

వేగంలో గాలితో పోటీపడుతూ సాహసమే ఊపిరిగా, స్వేచ్ఛే లక్ష్యంగా... రయ్‌మంటూ దూసుకెళ్తూ... తమ కలలకు హద్దులు లేవని చాటిచెబుతున్నారు మహిళా బైక్‌ రైడర్స్‌. బైక్‌ రైడింగ్‌ను కేవలం అభిరుచిగానే కాకుండా, ఉపాధిగానూ, సాహసంగానూ తమ జీవితంలో ఓ భాగంగా మార్చుకున్నారు. ఆత్మవిశ్వాసమే తోడుగా ముందుకు సాగుతూ నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లో ‘షీ పవర్‌ ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో జరిగిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్న రైడర్స్‌ చెప్పిన విషయాలివి...

మహిళా సాధికారతకు
చిన్న వయస్సునుంచే బైక్‌ నడపాలని కోరిక ఉండేది. అందుకు మా నాన్న కూడా సపోర్ట్‌ చేశారు. ఆ తరువాత ఉమెన్‌ బైక్‌ రైడర్లను చూశాను. వారిలో కొందరు సోలో బ్రైక్‌ ట్రావెలర్స్‌ కూడాను కలిశాను. వారి నుంచి నేను స్ఫూర్తి పొంది, అయిదేళ్లుగా బైక్‌ రైడింగ్‌ చేస్తున్నా. నేను అన్ని రకాల బైక్‌లు నడపగలను. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ఎక్కడ బైక్‌ ర్యాలీలు జరిగినా వాటిలో  పాల్గొంటున్నాను.

 నేను ఎలాగైతే స్ఫూర్తి పొందానో. అలాగే మరికొందరు తమ శక్తి ఏంటో తెలుసుకోవడం కూడా స్ఫూర్తిగా నిలవాలనుకున్నాను. ఈ రోజుల్లో కూడా మహిళలు బైక్‌లు నడుపుతున్నారంటే.. ‘అవసరమా’ అన్నట్టు చూస్తూ వెళ్లేవారిని గమనిస్తుంటాం. మహిళలు తమ శక్తి ఏంటో తెలియాలంటే పోరాటం ఉండే రంగాలలోకి రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.  
– దీప, ఉమన్‌ బైకర్‌

ప్యాషన్‌తో మొదలుపెట్టి...
మహిళలు పెళ్లి అవగానే ఇంటిపనులకే సమయమంతా కేటాయిస్తారు. తమ వ్యక్తిగత జీవితం మొత్తాన్నీ, శక్తినీ వదులుకుంటారు. వృత్తి, ద్యోగాలలో రాణిస్తున్నప్పటికీ చాలా మంది ఒంటరిగా ఏం చేయగలం.. అనుకుంటుంటారు. కానీ, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నాకున్న ఆసక్తులపై దృష్టి పెట్టాను. బైక్‌ రైడింగ్‌ అంటే ఉన్న ప్యాషన్‌పై దృష్టి పెట్టాను. అక్కడితో ఆగకుండా షీ మోటో ఉమెన్స్‌ రైడింగ్‌ క్లబ్‌ ఏర్పాటు చేశాను. తెలుగు రాష్ట్రాలలో మహిళలకు బైక్‌రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు, వారు స్వయంగా ఎదగడానికి కావల్సిన సూచనలతో ప్రోత్సహిస్తున్నాను.
– వి.ఎం.లీనారెడ్డి, షీ మోటో ఉమెన్స్‌ రైడింగ్‌ క్లబ్‌ ఫౌండర్‌

లూనాతో స్టార్ట్‌ చేసి 
బీటెక్‌ పూర్తి చేసి, ఓ టెక్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. పెళ్లి, ఉద్యోగం.. ఎన్ని పనులున్నా మన శక్తిని పెంచే ఇష్టాలలోనూ రాణించాలి. నాకు పద్నాలుగేళ్ల వయసులో ఇంట్లో ఉండే లూనాతో మొదట ప్రాక్టీస్‌ చేశా. అప్పుడు ఏదో పెద్ద మిషన్‌ను నడుపుతున్న అనుభూతి కలిగేది. ఆ తరువాత 12 ఏళ్లుగా అన్నిరకాల బైక్‌లు నడుపుతున్నాను. తెలంగాణ బైక్‌ రైడింగ్‌ సీజన్‌–1లో పోడియం విన్నర్‌గా నిలిచాను. బెంగళూర్‌లో ట్రాక్‌ డ్రాగ్‌ రేస్‌ విన్నర్‌తో పాటు బైక్‌ రైడింగ్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నాను. 
– సబా జబీన్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

కంపెనీ స్టార్ట్‌ చేసే దిశకు
పన్నెండేళ్ల వయసులో మా నాన్న బైక్‌ చూసి రైడింగ్‌ చేయాలన్న కోరిక కలిగింది. మా ఇంట్లో వాళ్లు వద్దన్నారు. కానీ, నాకున్న ఇష్టం వదిలేది కాదు. దీంతో మా నాన్న పడుకున్నాక బైక్‌ తీసేదాన్ని. ఇది చూసి, బైక్‌ నడపడానికి మా బ్రదర్‌ సపోర్ట్‌ ఇచ్చాడు. అలా బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత కాలక్రమం లో ఆ బైక్‌ రైడింగ్‌ ఓ కంపెనీ స్టార్ట్‌ చేసే దిశగా నన్ను తీసుకెళ్లింది. బైక్‌ రైడింగ్‌లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చాను. ఇస్తున్నాను. అడ్డుకుంటున్నారనో, అబ్బాయిలు మాత్రమే చేసే పని అనో భయపడి ఆగిపోతే ఏదీ సాధించలేం. మన శక్తి ఏంటో చూపాలంటే సాహస రంగాలలోనే రాణించాలి. 
– నళిని, ఉమన్‌ బైకర్‌

– ఎం.మహేందర్, సాక్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement