హ్యూమరమరాలు
రాంబాబు ఇంట్లో దొంగతనం జరుగుతుండగానే పోలీసులు దొంగను పట్టుకున్నారు.
దొంగను పరామర్శించడానికి నన్ను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు రాంబాబుగాడు.
‘‘దొంగకు పరామర్శ ఏమిట్రా?’’ నేను వాణ్ణి అడిగా.
‘‘మరి మనింట్లో వాడికేమీ దొరకలేదు కదరా... పాపం...’’ అన్నాడు వాడు.
రాంబాబుగాడు దొంగ దగ్గరకెళ్లి అడిగాడు.
‘‘మా ఇంట్లో దొంగతనం ఎందుకు చేశావ్ గురూ?’’
‘‘డబ్బుల కోసం’’ జవాబిచ్చాడు దొంగ.
‘‘మరి డబ్బులేమన్నా దొరికాయా?’’
‘‘ప్చ్... ఒక వెయ్యి రూపాయలు మాత్రం దొరికాయి. అవీ తీసుకునేలోపే దొరికిపోయా’’
‘‘అంత కష్టపడి దొంగతనం చేస్తే వెయ్యేనా? అవీ దక్కలేదు. నీ శ్రమకు తగిన ప్రతిఫలమూ దొరకలేదు. కనీసం ఓ పది వేలన్నా దొరికితే బాగుండేదేమో’’ జాలిపడ్డాడు రాంబాబు.
‘‘నువ్వు నన్ను తిట్టడం లేదేం?’’ ఆశ్చర్యపడ్డాడు దొంగ.
‘‘ఎందుకు తిట్టాలి? నీకు డబ్బులు అవసరం. అందుకే మా ఇంట్లో దొంగతనం చేశావ్. కానీ నా దగ్గర కూడా డబ్బులు ఎక్కువగా లేవని నీకు ముందే చెప్పుంటే బాగుండేది. పాపం... నీ శ్రమంతా వృథా అయింది కదా. ఓ పని చెయ్’’
‘‘ఏమిటది?’’
‘‘ఈసారి మా ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటే ముందు నాకు ఫోన్ చెయ్. నా దగ్గర ఎంత డబ్బుందో అడుగు. ఎంతున్నా... నేనో పదివేలు పక్కనబెడతా. విన్ విన్ సిచ్యువేషన్‌గా నీకు శ్రమా తప్పుతుంది, నాకు నష్టమూ తగ్గుతుంది!’’
దొంగ ఎలాగూ ఆశ్చర్యపోయాడుగానీ.. పక్కనే ఉన్న పోలీసు కూడా నోరెళ్లబెట్టాడు.
‘‘ఇదేంట్సార్... నేనెప్పుడూ ఎవరినీ ఇలా చూళ్లే’’ ఆశ్చర్యపోతూ అన్నాడు పోలీస్.
‘‘దొంగంటే ఏమనుకున్నారు మిస్టర్ పోలీస్. వాడు మన ఎకానమీకీ, వ్యవస్థలకూ పట్టుకొమ్మ ’’
‘‘మీ ఫ్రెండ్‌కు పిచ్చెక్కింది’’ అన్నాడా పోలీస్ నావైపు చూస్తూ.
‘‘నాకేమీ పిచ్చెక్కలేదు. దొంగగారి ప్రాధాన్యత మీకే అర్థం కావడం లేదు’’ అంటూ తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు రాంబాబుగాడు.
‘‘ఇప్పుడూ... దొంగే లేడనుకోండి. అప్పుడు మీ పోలీసుల పనుల్లో సగం తగ్గుతాయి. అప్పుడు మీ సిబ్బందిలో సగానికి సగం మంది అవసరం ఉండదు. దొంగతనాలు ఉండవు కాబట్టి... తాళాల కంపెనీలూ, సీసీ కెమెరాల ఫ్యాక్టరీలూ, సెక్యూరిటీ సిబ్బంది అవసరాలూ పెద్దగా ఉండవు. దాంతో బోలెడన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. వీళ్ల తరఫున వాదించి, బెయిలూ గట్రా ఇప్పించే లాయర్ల సంఖ్యా సగానికి సగం తగ్గుతుంది. ఇలా చూస్తే బోలెడంత మందికి ఉపాధి లేకుండాపోతుంది. కొన్ని వ్యవస్థలే కుప్పకూలతాయి. అందుకే బోలెడంత మందికి పని కల్పించడం కోసమైనా దొంగతనం అనే వ్యవస్థ పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ స్పీచ్ ఇచ్చాడు మా రాంబాబు గాడు.
ఎందుకో... అప్పుడప్పుడూ మా రాంబాబుగాణ్ణి చూస్తుంటే వాణ్ణి మించిన కౌన్సెలర్ మరింకెవ్వడూ లేడనిపిస్తుంటుంది.
ఎందుకంటే... మావాడు దొంగా, పోలీస్... ఈ ఇద్దరికీ ఏకకాలంలో, ఏకధాటిగా ఆన్సర్ ఇచ్చాడుగా మరి!!
– యాసీన్


