ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే చదువు, అనుభవం, నైపుణ్యాల గురించి అడుగుతారు. కానీ పెళ్లయిందని, పిల్లలను ఎప్పుడు కంటారని అడిగితే ఎలా ఉంటుంది? ఓ మహిళకు ఎదురైన ఇలాంటి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో శతాక్షి ద్వివేది అనే మహిళ తన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకున్నారు. మొదట హెచ్‌ఆర్ ఆమె ఎక్కడ ఉంటారు? ఆఫీసుకు రాకపోకలు ఇబ్బందిగా ఉంటాయా? అని అడిగారు. తన భర్త కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నారని, ఆయనతో కలిసి ఆఫీసుకు రావచ్చని ఆమె సమాధానమిచ్చారు.
అయితే, తనకు ఇటీవలే పెళ్లయిందని చెప్పగానే హెచ్‌ఆర్ ప్రశ్నలు మారిపోయాయని శతాక్షి తెలిపారు. త్వరలోనే పిల్లలను కనాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని అడగడంతో తాను అసౌకర్యానికి గురైనట్లు చెప్పారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పే సంస్థలు.. ఇంటర్వ్యూలలో ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తమకు ఎదురైన అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. పెళ్లికాని మహిళలను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని, పెళ్లయిన వారిని పిల్లలను ఎప్పుడు కంటారని అడుగుతున్నారని పేర్కొంటున్నారు. తల్లులైన మహిళలను ఉద్యోగం, పిల్లల బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
అయితే, శతాక్షి ఇంటర్వ్యూకు హాజరైన సంస్థ పేరు వెల్లడించలేదు. అభ్యర్థుల వ్యక్తిగత జీవితానికి బదులు వారి అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే అభిప్రాయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.
ఇదీ చదవండి: ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర! రూ.420 కోట్ల వజ్రాల అలంకరణ..


